మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దేశంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు, వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
డా.మన్మోహన్ సింగ్ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, 33 ఏళ్ళపాటు రాజ్యసభ సభ్యుడుగా దేశానికి అమూల్యమైన సేవలందించారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని సరికొత్త మార్గంలోకి నడిపించినందుకు ఆయనకు, వాటిని ధైర్యంగా అమలుచేసినందుకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఇద్దరి పేర్లు దేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని కాపాడిన అంత గొప్ప ఆర్ధికవేత్త ప్రధానమంత్రి పదవి చేపడితే దేశం మరెంత వేగంగా పురోభివృద్ధి సాధించి ఉండాలి. కానీ ఆ పదవి చేపట్టాలని ఆశపడి రాజకీయ కారణాల వలన వెనక్కు తగ్గిన సోనియాగాంధీ, ఆయనని ఆ కుర్చీలో కూర్చోబెట్టి తానే దేశాన్ని పాలించి మళ్ళీ అస్తవ్యస్తం చేశారు.
యావత్ ప్రపంచంలోనే గొప్ప ఆర్ధిక నిపుణుడుగా పేరొందిన డా.మన్మోహన్ సింగ్, ఆమె కారణంగా తీవ్ర అప్రదిష్టపాలయ్యారని చెప్పక తప్పదు.
ఆయన హయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగా, కాంగ్రెస్ నేతలు ఆ క్రెడిట్ ఆయనకు బదులు సోనియా గాంధీకి కట్టబెట్టడమే ప్రభుత్వంపై ఆమె కర్ర పెత్తనానికి గొప్ప నిదర్శనం. కానీ ఆమె, కాంగ్రెస్ నేతల నిర్వాకం వలన దేశంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మాత్రం ఆయన పద్దులో జామా అయ్యాయి. అవి ప్రధానిగా ఆయన ప్రతిష్టను, దేశ ప్రతిష్టకి కూడా తీరని కళంకం తెచ్చాయి.
ఆర్ధికమంత్రిగా దేశాన్ని గాడిన పెట్టిన డా.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మరింత అభివృద్ధి చేయలేరా?కానీ ఎందుకు విఫలం అయ్యారు? అంటే సహజంగా చాలా సౌమ్యుడు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కావడం చేతనే అని చెప్పుకోవచ్చు. సోనియా గాంధీ నిర్ణయాలను ఎదిరించలేక, దేశ ముదురు కేంద్ర మంత్రులను కట్టడి చేయలేకపోవడం వలననే ఆయన అప్రదిష్ట పాలయ్యారు.
డా.మన్మోహన్ సింగ్ తన హయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు, కుంభకోణాలకు మౌన సాక్షిగా ఉండిపోయారు. స్వర్గీయ పీవీ నరసింహారావు ‘మౌనం’తో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. కానీ డా.మన్మోహన్ సింగ్ ‘మౌనం’తో అప్రదిష్ట పాలయ్యారు.
కానీ అంత మాత్రాన్న దేశానికి ఆయన చేసిన సేవలను, ఆయన నిబద్దతని, మేధస్సుని ఎవరూ వేలెత్తి చూపించలేరు.
వజ్రాయుధం వంటి డా.మన్మోహన్ సింగ్‌ని పీవీ నరసింహారావు తెలివిగా ఉపయోగించుకొని దేశానికి మేలు చేశారు. కానీ ఆ వజ్రాయుధం విలువ తెలీని కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలని ఉపయోగించుకోలేకపోయింది. కనుక అది కాంగ్రెస్ చాతకానితనమే తప్ప ఆయన తప్పు కానేకాదు.
దేశానికి కొత్త ఆర్ధిక విధానాలు రూపొందించి దిశానిర్దేశం చేసిన డా.మన్మోహన్ సింగ్‌కి రాష్ట్ర ప్రజలందరి తరపున మిర్చీ9 నివాళులు అర్పిస్తోంది.




