కేవలం 251 రూపాయలకు స్మార్ట్ ఫోన్ ఏంటి… మరీ కామెడీ కాకపోతేనూ అంటూ అవహేళన చేసిన వారున్నారు. కాదు కాదు… అసలు ఇదంతా పెద్ద స్కాంలో భాగంగా చేస్తున్నారు… ఈ ప్రకటనతో కొన్ని కోట్ల రూపాయలను సదరు మొబైల్ సంస్థ వెనుకేసుకోబోతోంది అని ఆరోపణలు చేసిన వారున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే మరో వైపు ఐటీ దాడులతో ‘రింగింగ్ బెల్’ సంస్థ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తమ చిత్తశుద్దిని చాటుకుని, విమర్శలపై రివేంజ్ తీర్చుకునేందుకు మరో రెండు రోజుల్లో మార్కెట్లోకి వచ్చేందుకు సదరు సంస్థ సిద్ధమవుతోంది.
ముందుగా ఈ నెల 30వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ కోసం తొలుత రిజిస్టర్ చేసుకున్న 30 వేల మందికి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతి క్రింద ఫోన్ ను అందజేస్తామని సంస్థ సీఈఓ మోహిత్ గోయెల్ ప్రకటించారు. అయితే తొలి దశలో రెండు లక్షల మొబైల్స్ ను విక్రయించాలన్నది తమ అభిమతంగా చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా స్మార్ట్ మొబైల్స్ వినియోగంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మొబైల్ ను రూపొందించామని, ఇండియాలో ఉన్న వారికే ఈ మొబైల్ డెలివరీ చేస్తామని అన్నారు. ఎన్నో విశిష్టతలు కూడుకున్న ఈ మొబైల్ ఫస్ట్ రివ్యూను తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.



