1930 మార్చి-ఏప్రిల్ లో నిర్వహించిన దండి సత్యాగ్రహం సమయంలో గుజరాత్ దండి గ్రామంలో మహాత్మాగాంధీ కర్ర చేతపట్టుకుని నడిపించిన చిన్నోడు, మహాత్ముడి మనవడు అయిన కానూ రాందాస్ గాంధీ కాలం చేసారు. ఇటీవల బాగా దెబ్బతిన్న ఆరోగ్యంతో గత కొన్ని రోజులుగా సూరత్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 87 సంవత్సరాల రాందాస్ కార్తీక సోమవారం నాడు స్వర్గస్తులైనారు.
అయిన వారందరికీ దూరంగా తన భార్యతో కలిసి ఒంటరి జీవితాన్ని గడిపిన గాంధీ శారీరకంగానూ, మానసికంగా ఆరోగ్యం కలత చెందడంతో కొన్ని రోజుల క్రితమే మీడియా వర్గాలలో ప్రత్యేక కధనాలు ప్రసారమయ్యాయి. అయితే ఇంతలోనే ఆయువు తీరిపోయి, తన తాత వద్దకు వెళ్ళిపోయారు. దీంతో మరోసారి ఆ దండి సత్యాగ్రహం నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఫొటోలో గాంధీ చేతిలోని కర్రను ఒక వైపు పట్టుకున్న చిన్నారి కానూ రాందాస్ గాంధీ ముందుండి మహాత్ముడిని నడిపిస్తున్నట్లుగా కనపడుతోంది.



