గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం దాడి చేసి విధ్వంసం సృష్టించారు. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు నిన్న సాయంత్రం టిడిపి కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ ఉన్న టిడిపి కార్యకర్తలని కర్రలతో చితకబాదారు. పార్టీ కార్యాలయం ముందు పార్క్ చేసి ఉన్న విజయవాడ రూరల్ టిడిపి కార్యదర్శి కోనేరు సందీప్‌కి చెందిన ఇన్నోవా కారుపై కర్రలతో, రాళ్ళతో దాడి చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అదేసమయంలో మరికొందరు వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యాలయంలోకి జొరబడి అద్దాలు, ఫర్నీచర్,కంప్యూటర్స్ పగులగొట్టి విధ్వంసం సృష్టించారు.
రెండురోజుల క్రితం వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేయడంతో టిడిపి నేత దొంతు చిన్నా వంశీపై ప్రతివిమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ అనుచరులు నిన్న ఆయన ఇంటిపై కూడా దాడి చేశారు. దీంతో వంశీపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దొంతు చిన్నా అధ్వర్యంలో సోమవారం టిడిపి కార్యకర్తలు రోడ్లపై బైటాయించి నిరసనలు తెలిపారు.
నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడం కోసం వజ్రా పోలీస్ వాహనాలని, వందలాది మంది పోలీసులని మోహరించే ప్రభుత్వం, గన్నవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకి తావిస్తోంది. పోలీసుల సమక్షంలోనే వంశీ అనుచరులు కర్రలతో, రాళ్ళతో టిడిపి కార్యకర్తలపై విరుచుకుపడి దాడి చేశారు. వారి సమక్షంలోనే టిడిపి కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు.
వారిని అడ్డుకొనే ప్రయత్నంలో టిడిపి కార్యకర్తలు ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ వైసీపీ కార్యకర్తల ధాటికి నిలువలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో వల్లభనేని వంశీ గన్నవరంలోనే ఉన్నారు. అయితే ఈ దాడులతో తనకి సంబందం లేదని, ఈ గొడవలు నివారించడానికే తాను గన్నవరం వచ్చానని వల్లభనేని వంశీ చెప్పారు.
రాష్ట్రంలో టిడిపి కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు, వాహనాలకి నిప్పు పెట్టడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం చూస్తే, రాబోయే ఎన్నికలలో ఓడిపోతామనే అభద్రతాభావం వైసీపీలో పెరుగుతున్నట్లు భావించవచ్చు. సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకి మూడున్నరేళ్ళుగా డబ్బు పంచిపెడుతున్నా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పర్యటనలకు భారీగా ప్రజలు తరలివెళుతుండటంతో వైసీపీలో అభద్రతాభావం పెరిగిన్నట్లుంది.



