దాహం వేస్తే బావి తవ్వడం… మన ప్రభుత్వాలకు అలవాటే!

People struggling due to gas shortage in India amid fuel crisis and government failure

దాహం వేస్తే బావి తవ్వడం మొదలుపెట్టినట్లు ఉంటుంది మన ప్రభుత్వాలు, వాటిలో వ్యవస్థల పనితీరు… ఆలోచనలు. ఓ పక్క దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం నానా తిప్పలు పడుతుంటే వాటికి ఏ మాత్రం కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చమురు కంపెనీలు నిసిగ్గుగా అబద్దాలు చెపుతున్నాయి.

వాటి కొరత లేనప్పుడు ఎందుకు లభించడం లేదు? గ్యాస్ సిలిండర్లు విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చమురు కంపెనీలు ఏం చేస్తున్నాయి?ఎందుకు అడ్డుకోవడం లేదు?

ADVERTISEMENT

గ్యాస్ కొరత వలన హోటల్స్‌లో, టిఫిన్ సెంటర్స్, బేకరీలు, ఇంకా పలు సంస్థలు మూతపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని నిర్లజ్జగా అబద్దాలు చెపుతున్నాయి తప్ప ఈ సమస్యని పరిష్కరించలేకపోతున్నాయి.

గ్యాస్ కొరతకి అవి కనుగొన్న గొప్ప పరిష్కారం ఏమిటంటే హడావుడిగా లక్ష ఇండక్షన్ స్టౌవులకు ఆర్డర్ పెట్టడం! దాహం వేస్తే బావి తవ్వడం మొదలుపెట్టినట్లే ఉంది కదా ఇది?

రేపు అమెరికా-ఇరాన్‌ యుద్ధం ముగిసి గ్యాస్ కొరత తీరిపోయి ప్రజలు మళ్ళీ గ్యాస్ వాడకం మొదలుపెడితే ఈ లక్ష ఇండక్షన్ స్టౌవులు పక్కన పడేయక తప్పదు.

ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడింది కనుక కరెంటుతో పనిచేసే ఇండక్షన్ స్టౌవులు వాడమని ప్రభుత్వాలు ప్రోత్సహించవచ్చు. వేసవిలో కరెంట్ వాడకం గణనీయంగా పెరిగిపోతే అప్పుడు విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీలు పెంచేయకుండా ఉంటాయా? అప్పుడు కూడా ఇండక్షన్ స్టౌవులు వాడమని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయా? ప్రోత్సహించినా ప్రజలు వాడుతారా?

ఓ పెను సమస్య వచ్చి మీద పడే వరకు దానిని పర్యవసనాలు అంచనా వేయలేకపోవడం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వాల వైఫల్యం కాదా?

గతంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కరోనా సమయంలో, లాక్ డవున్ సమయంలో అచ్చం ఇలాగే జరిగింది. కరోనా మహమ్మారి ముందెన్నడూ రాలేదు కనుక దాని గురించి ఎవరూ అంచనా వేయలేకపోయారు.

కానీ ఆ మహమ్మారి వల్లనే మన దేశంలో ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందికి ఎంత కొరత ఉందనే విషయం బయటపడింది. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బావులు తవ్వడం మొదలుపెట్టాయి.

కానీ అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ముందే తెలుసు కదా? కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కులాలు, మతాలున్నాయి? ఏయే ప్రాంతాలలో ఆ మతం, ఆ కులం ఎంత మందున్నారు? అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వద్ద ఖచ్చితమైన లెక్కలుంటాయి. అందుకు తగ్గట్లుగా ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించుకోగలవు.

కానీ ఇలాంటి సమస్య వస్తే దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ముందస్తు అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోలేవా ఈ ప్రభుత్వాలు, వాటిలో పనిచేస్తున్న వేలాది మంది ఐఏఎస్ అధికారులు, మేధావులు, నిపుణులు?

సమస్యని ముందుగా గుర్తించలేకపోతే పాయె… దేశ ప్రజలు గ్యాస్, పెట్రోల్ డీజిల్ కొరతతో సతమతమవుతుంటే ఎలాంటి సమస్య లేదని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు కాదా?

ADVERTISEMENT
Latest Stories