ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పడు మన దేశం అంబానీ, అదానీల చేతుల్లో ఉందనేది సత్యం. ప్రభుత్వాలు, వాటిని నడిపే రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంబానీ, అదానీలతో సంబంధాలు కలిగి ఉండటం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది.
వారిరువురు రాజకీయాలలో లేనప్పటికీ మన వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతున్నారనేది వాస్తవం. కనుక వారి పరిశ్రమలు, పెట్టుబడులతో దేశానికి లబ్ధి చేకూరుస్తున్నప్పటికీ, అవి ‘శివలింగం మీద తేలు’లాగా మారాయని చెప్పక తప్పదు. భక్తులు పూజించే శివలింగం మీద తేలుని తొలగించలేరు. కొట్టి చంపలేరు. అలాగని దానిని విస్మరించి ధైర్యంగా ఉండలేరు.
అంబానీ, అదానీల కంపెనీలు దేశమంతా అల్లుకుపోయినా వారిలో అంబానీ కాస్త ‘లో ప్రొఫైల్’ మెయిన్‌టైన్ చేస్తుంటారు. కనుక అంబానీ వ్యాపార సామ్రాజ్యం పూలనావలా సాగిపోతుంటుంది.
కానీ అదానీ గ్రూప్ ఎక్కడికక్కడ ప్రభుత్వాలను, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కాంట్రాక్టులు దక్కించుకుంటుండటంతో ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు అవి బెడిసి కొట్టి బయటపడుతుంటాయి.
విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ-జగన్ మద్య జరిగిన వ్యవహారంపై కోర్టు కధలు ఇంకా నడుస్తుండగానే, తాజాగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ)లో జగన్ హయాంలో జరిగిన భాగోతం బయటపడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సులిరియాలో ఏపీఎండీసీకి బొగ్గు గనులు ఉన్నాయి. అది తవ్వి తీసిన బొగ్గులో 75 శాతం బొగ్గు కొలుగోలు టెండర్ 2021 లో అదానీ గ్రూప్ దక్కించుకుంది.
మూడేళ్ళ ఒప్పందంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా ఏపీ ఎండీసీ నష్టపోకుండా, నిబంధనల ప్రకారం అదానీ గ్రూప్ రూ.250 కోట్లు జమా చేసింది. కానీ దానిలో ఇప్పటికే రూ.100 కోట్లు వాపసు పొందింది. ఏపీ ఎండీసీ ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెపుతున్నా వినకుండా ఎండీ వెంకటరెడ్డి నాలుగు విడతలలో వంద కోట్లు చెల్లింపజేశారు!
ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో దీని వలన ఏపీలో తమ మిగిలిన ప్రాజెక్టులపై ప్రభావం చూపవచ్చనే భయంతో ఆ వంద కోట్లు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్దపడింది.
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అదానీ గ్రూప్ కడపలో ఓ భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది.
కనుక అదానీ అవకతవకలు బయటపడుతున్నా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ వంద కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తే తాము వద్దన్నామని చెప్పారు.
అంటే అదానీ తన వ్యాపారాల విస్తరణ కోసం ప్రభుత్వాలను ఏవిదంగా డీల్ చేస్తుంటారో అర్దమవుతోంది. కనుక ఆదానీతో వ్యవహారం అంటే పులి మీద సవారీ అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారనుకోవచ్చు.
దేశంలో అన్నీ రాష్ట్రాలకు అదానీ పెట్టుబడులు, పరిశ్రమలు కావాలి కానీ అదానీ అంటే అందరూ భయపడుతున్నారు. కానీ ఒక్క జగన్ మాత్రమే ధైర్యంగా అదానీతో ముందుకు సాగారు.




