జయ మరణంపై అనుమానాలున్నాయంటూ ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించిన నటి గౌతమి రాజకీయాల్లోకి రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జయ మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుండే ఆమెను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానానికి ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, గురువారం నాటి (16వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొనగా అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పేరును, పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేరును దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక జయ మేనకోడలు దీప స్వతంత్ర అభ్యర్థిగా (కోడిపుంజు గుర్తుతో) పోటీ దిగాలని ప్రయత్నాలు చేస్తుండగా, అసలు పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ ఊగిసలాడుతోంది.
ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సాధించిన విజయం ప్రభావం తమిళనాడుపైనా పడుతుందని, దాంతో పాటు సినీ గ్లామర్ కూడా కొంతమేరకు పనిచేస్తుందనే ఉద్దేశంతో జయ మృతి తర్వాత బాగా హల్చల్ చేసిన గౌతమీని బరిలోకి దింపే యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు గౌతమి అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. నామినేషన్ల ప్రక్రియతో అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత రానుంది.



