ప్రస్తుత రోజుల్లో ‘ఒక్క రూపాయి’కి ఏమొస్తుంది..? చిన్న పిల్లాడు కొనుగోలు చేసే చాక్లెట్ కూడా రావట్లేదు అన్న విషయం తెలిసిందే. కానీ, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం జీహెచ్ఎంసీలో ఉన్న నిరుపేదల కోసం ‘ఒక రూపాయి’ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ పరిధి వరకు మాత్రమే వర్తించే ఈ సంక్షేమ పథకంలో కేవలం ఒక్క ఒక్క రూపాయితో మంచినీటి కనెక్షన్ ను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నగరంలోని పేదలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గడచిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భాగ్యనగరి ప్రజలు బ్రహ్మరథం పట్టిన నేపధ్యంలో… ‘సింగిల్ రూపాయికే నల్లా కనెక్షన్’ పథకాన్ని ప్రభుత్వం ప్రజలకు బహుమతిగా అందించనుంది. అయితే ఈ పధకం ద్వారా ఎంతమంది లబ్దిదారులు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడం విశేషం. పధకం రూపకల్పన బాగున్నా, పరిమిత సంఖ్యలో లబ్దిదారులు ఉంటే, ఆ పధకం ప్రయోజనం పెద్దగా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైవిధ్యంతో కూడిన సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో ఉన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల విషయంలో తెలంగాణా సర్కార్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని పలు వర్గాలకు మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.



