ఒకప్పుడు తెలుగు వాడుక భాష కూడా కటినంగానే ఉండేది. దానిలో గ్రాంధిక, సంస్కృత పదాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అటువంటి తెలుగు భాషని సామాన్య ప్రజలు సైతం సులువుగా మాట్లాడుకొని అర్దం చేసుకొనేందుకు వీలుగా వాడుక భాషని పరిచయం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. ఆయన 1863, ఆగస్ట్ 29న శ్రీకాకుళం జిల్లాలోని పర్వాతలపేట అనే కుగ్రామంలో జన్మించారు. ఆయన తెలుగు వాడుక భాషగా మార్చేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ఆగస్ట్ 29న ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాము.
ఈ సందర్భంగా నిన్న తెలుగు భాషాభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి నాలుగు ముక్కలు మాట్లాడలేదు. ఓ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గిడుగు రామమూర్తిని పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బహుశః అందుకేనేమో నేడు తాపీగా సిఎం జగన్ ట్వీట్ చేశారు.
“ఆధునిక తెలుగు భాషావేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. గిడుగువారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి తెలుగు భాషను చంపేస్తోంది. ఏమంటే పేద పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకూడదా?జీవితంలో రాణించకూడదనుకొంటున్నారా?ఇంగ్లీషు మీడియంలో చదువుకొంటేనే జీవితంలో రాణిస్తారంటూ వితండవాదం చేస్తోంది. విద్యార్థులపై బలవంతంగా ఇంగ్లీషుని రుద్దుతోంది.
సిఎం జగన్ తెలుగులో మాట్లాడానికి కూడా తడబడుతుంటారు. ముఖ్యమంత్రికే తెలుగు భాషపై అభిమానం, మమకారం లేనప్పుడు ఇక ప్రభుత్వానికి ఏముంటుంది?అందుకే రాష్ట్రంలో ‘ఇంగ్లీషు పాలన’ సాగుతోంది. తెలుగు భాషని అన్ని విధాలుగా చంపేస్తూ మళ్ళీ గిడుగు రామమూర్తిని తలుచుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
తెలుగు భాషపై అంతులేని మమకారం చూపిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. గిడుగు రామమూర్తి తెలుగుని వాడుక భాషగా మారిస్తే, నందమూరి తారక రామారావు ఆ తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పెద్దలతో పోరాడారు. తన సినిమాలు, పాలనతో తెలుగు భాషకు, తెలుగువారి ఆత్మగౌరవానికి, ఎందరో మహనీయులు నడయాడిన ఈ తెలుగుగడ్డకు అపూర్వమైన వైభవం కల్పించారు.
కానీ నేడు రాష్ట్రంలో తెలుగుని ఓ పద్దతి ప్రకారం చంపేస్తూ, ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, మహనీయులు నడయాడిన ఈ నేలపై రక్తపాతం సృష్టిస్తూ, రాష్ట్రాన్ని దోచేసుకొంటూ అప్పుల పాలు చేసేస్తున్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు. ఇదేనా ఆంధ్రా ప్రజలందరూ కోరుకొంటున్నది?



