బంగారు చొక్కాను ధరిస్తూ పుణెలో ‘గోల్డెన్ మ్యాన్’గా పేరు తెచ్చుకున్న బిజినెస్ మెన్ దత్తాత్రేయ పుగే హత్యకు గురైన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ మ్యాన్’ హత్య ఉదంతంపై దర్యాప్తు చేపడుతోన్న పోలీసులకి దత్తా కుమారుడు శుభమ్ స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. కేవలం 1.5 లక్షల రూపాయల కోసం వారు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
‘గోల్డెన్ మ్యాన్’ కుమారుడు శుభమ్ స్నేహితుడు అతుల్ మోహిత్ గురువారం రాత్రి శుభమ్‌కి ఫోన్ చేసి తమ మిత్రుడి బర్త్ డే వేడుకకు రావాలని, తనతో పాటు తండ్రి ‘గోల్డెన్ మ్యాన్’ను కూడా తీసుకు రావాలని ఆహ్వానించాడు. పార్టీలో ఉత్సాహంగా గడుపుదామని వచ్చేటప్పుడు బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్లు కూడా తీసుకురమ్మని శుభమ్‌కి అతుల్ మోహిత్ చెప్పాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే తన తండ్రి దత్తాను పార్టీకి వెళ్లాలని కోరాడు శుభమ్.
తన స్నేహితుడు రోహన్ పంచాల్‌తో కలిసి బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకు రావడానికి శుభమ్ మరో కారులో వెళ్లాడు. ఇంతలో పార్టీకి వెళ్లిన ‘గోల్డెన్ మ్యాన్’ని శుభమ్ స్నేహితుడు మోహిత్, మరికొందరు కత్తితో పొడిచారు. శుభమ్ అక్కడికి చేరుకునే సమయానికి మోహిత్, మరికొందరు తన తండ్రిని పొడుస్తూ కనపడ్డారు. ఈ విషయాన్ని శుభమ్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ‘గోల్డెన్ మ్యాన్’ పొడిచిన తర్వాత మోహిత్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు.



