ఇప్పుడు మాటకారితనం కూడా ఓ ముఖ్య రాజకీయ లక్షణమైపోయింది. రాజకీయ నాయకులు మాటకారితనంతోనే తమ ఆలోచనలను, అభిప్రాయాలను ప్రజల అభిప్రాయలుగా చలామణి చేస్తున్నారు. ఉదాహరణకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించింది. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చాలా అవసరమని వాదించడం మొదలుపెట్టింది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఎందుకు అంగీకరించింది?అమరావతిని నిర్మిస్తామని హైకోర్టుకు ఎందుకు అబద్దం చెప్పింది?
అమరావతిని రాజధాని చేయాలని రైతులు మహాపాదయాత్ర పెట్టుకొంటే వారిని చంద్రబాబు నాయుడు ఎగద్రోస్తున్నారని, వారిని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడుకి అమరావతిపై ఉన్న ప్రేమ నిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పష్టంగా కనబడిందని ఆరోపించారు. అది సంతోషించవలసిన విషయమే కానీ బాధపడవలసినది కాదు కదా? కానీ అదే నేరమన్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు.
“మా ప్రభుత్వం విశాఖనగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేద్దామనుకొంటే, చంద్రబాబు నాయుడు అమరావతినే రాజధాని చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారు. అంటే విశాఖనగరం అభివృద్ధి చేయడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదా? అదే మాట ఆయనను, స్థానిక టిడిపి నేతలను చెప్పమనండి చూద్దాం,” అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు.
ప్రజలకు ఆదర్శంగా ఉంటూ మార్గదర్శనం చేయాల్సిన మంత్రులు ఈవిదంగా తమ మాటకారితనంతో ప్రజల మద్య ప్రాంతీయ విబేధాలు రగిలించి చిచ్చు పెట్టాలనుకోవడం చాలా దారుణం. ఎందుకంటే, అమరావతిని నిర్మించడమంటే విశాఖ, కర్నూలును వ్యతిరేకించడం కాదని అందరికీ తెలుసు.
వైసీపీ ప్రభుత్వానికి నిజంగా విశాఖ, కర్నూల్ మీద అంత ప్రేమ ఉండి ఉంటే ఈ మూడేళ్ళలో రెంటినీ ఎందుకు అభివృద్ధి చేయలేదు? కానీ విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకొంటున్నారని మంత్రి అమర్నాథ్ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
నిజానికి మూడేళ్ళుగా అమరావతిని నిర్లక్ష్యం చేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన వేల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలూ అన్నీ హైదరాబాద్‌కి, తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కారణంగా నేటికీ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళకతప్పడం లేదు.
వైసీపీకి నిజంగా రాష్ట్రాభివృద్ధి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉంటే మూడు రాజధానులే అవసరం లేదు. చకచకా అమరావతిని నిర్మిస్తూ అన్ని జిల్లాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా చేయవచ్చు. తెలంగాణ ఈవిదంగానే కదా ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది?
కానీ వైసీపీకి ఎంతసేపు మళ్ళీ అధికారంలోకి రావలనే యావ తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఏ కోశాన్నా లేదు. అందుకే మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలనుకొంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే అమరావతి రాజధాని ఒక్కటే శరణ్యం. అది లేకుండా ఎవరూ ఏపీ మొహం కూడా చూడరు. కనీసం వైసీపీ నేతలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సాహసించడం లేదంటే అర్దం ఏమిటి?



