మంత్రిగా ఉన్నప్పుడు గుడివాడ మాట్లాడలేదు కానీ…

gudivada-amarnath-chandrababu-naidu-sri-city

సిఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సోమవారం కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, మరికొన్నిటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు, వార్తలు అన్ని ప్రధాన పత్రికలలో, సోషల్ మీడియాలో వచ్చాయి.

ADVERTISEMENT

అయితే గుడ్డు మంత్రిగానే ఎక్కువ పాపులర్ అయిన మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వైసీపి కూడా సిఎం చంద్రబాబు నాయుడుని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.

గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మా ప్రభుత్వం విశాఖలో గ్లోబల్ సదస్సు నిర్వహించి రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధించాము. ఓ పరిశ్రమకి అన్ని అనుమతులు ఇచ్చి శంకుస్థాపన చేయడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడే ఆ పరిశ్రమలన్నిటినీ రప్పించిన్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు.

ఆనాడు మేము వాటిని రాష్ట్రానికి రప్పించినందునే నేడు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగలుగుతున్నారు.

శ్రీసిటీలో మాత్రమే కాదు విశాఖ-చెన్నై, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, రానున్న కాలంలో బెంగళూరు-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కర్నూల్ వద్ద ఓర్వకల్ సుమారు 7,000 ఎకరాలు భూసేకరణ చేశాము. ఈవిదంగా మేము అనేక కంపెనీలతో మాట్లాడి, సమస్తం ఏర్పాటు చేస్తే, చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ తీసుకోవడం సరికాదు,” అంటూ విమర్శలు గుప్పించారు.

అయితే ఇక్కడ కొన్ని విషయాలు తప్పక చెప్పుకోవలసి ఉంటుంది.

శ్రీ సిటీని ఏర్పాటు చేసి దానిలో అనేక చిన్నా పెద్ద పరిశ్రమలు వచ్చేలా చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడే. దానిలో ఏర్పాటైన ఐకియా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీని జగన్‌ ప్రభుత్వం, స్థానిక వైసీపి నేతలు వేధింపులు భరించలేక ఒకానొక సమయంలో మూసుకు వెళ్ళిపోయేందుకు కూడా సిద్దపడిన సంగతి అందరికీ తెలుసు.

అలాగే రాష్ట్రం నుంచి అమర్ రాజాతో సహా పలు కంపెనీలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ఈ కధలన్నీ అందరికీ తెలిసినవే. కనుక శ్రీసిటీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటైతే అందుకు గుడివాడ సంతోషించాలి కానీ బాధపడటం దేనికి?

గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పరిశ్రమల ఏర్పాటు గురించి మాట్లాడితే దాని వలన ఆయనకు, జగన్‌ ప్రభుత్వానికి కూడా గౌరవం లభించేది. కానీ అప్పుడు జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను ఎద్దేవా చేస్తూ కాలక్షేపం చేసేసి చివరికి ‘గుడ్డు మంత్రి’గా మిగిలిపోయి ఎన్నికలలో ఓడిపోయారు.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి. కనుక ఆయన పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం నేరం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేసిన వాటిని జగన్‌ ప్రభుత్వం పూర్తి చేసి ఉండి ఉంటే, వాటి ప్రారంభోత్సవాల క్రెడిట్ జగన్‌కే దక్కి ఉండేది కదా?

అలాగే తమ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తే వాటికి ఎన్నికలలోగా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకుండా ఎవరు అడ్డుకోలేదు కదా?చేసుకొని క్రెడిట్ తీసుకోవచ్చు కదా? కానీ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన మూడు నెలలలోపే ఒకేసారి శ్రీసిటీలో 15 కంపెనీలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తప్పు ఎలా అవుతుంది?

జగన్‌ అసూయ, ద్వేషం, విధ్వంసమే విధానాలుగా మార్చుకోవడం వలననే తాను స్వయంగా నష్టపోవడమే కాకుండా వైసీపిని కూడా కోలుకోనంతగా దెబ్బ తీశారు. భస్మాసురిడిలా సొంత పార్టీని, సొంత రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాక ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికో దక్కుతోందని ఏడ్చి ఏం ప్రయోజనం?

ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడే దాని విలువ గుర్తెరిగి ఉండి ఉంటే నేడు ఇలా సిఎం చంద్రబాబు నాయుడుపై, టిడిపి కూటమి ప్రభుత్వంపై పడి ఏడ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories