సాధారణంగా కొంతమంది ఆవేదనతోనో క్షణికావేశంతోనో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటారు. కానీ జగన్ మాత్రం ఆ ఫ్యానుకే ఉరి వేశారని కొందరు, కాదు ఆ ఫ్యానుకే వైసీపిని ఉరివేశారని మరి కొందరూ వాదించుకుంటున్నారు. అందరి భారం భరించలేకనే ఆ ఫ్యాను రెక్కలు విరిగి పడిపోయిందిని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద ‘వైసీపి ఫ్యాను’ తిరగడం ఆగిపోయింది. దాంతో బాటే వైసీపి శబ్ధాలు కూడా ఆగిపోయాయి.
ఇంతకాలం సోషల్ మీడియాలో వైసీపి నేతల ప్రేలాపనలు ఇప్పుడు వినిపించడం లేదు. బహుశః ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదో… లేక నోరు విప్పితే టిడిపి శ్రేణుల చేతిలో బడిత పూజ జరుగుతుందనే భయంతోనో అందరూ ‘సైలైంట్ మోడ్’లోకి వెళ్ళిపోయారు. ఇక జగన్ ఆత్మసాక్షి కూడా కాస్త నెమ్మదించి ‘పెరిగిన బంగారం ధరలు’, ఏపీలో ‘దంచికొడుతున్న వర్షాలు’, ‘జాతీయ రాజకీయాలు’ వంటి ఇబ్బంది లేని వార్తలు వేసుకుంటూ ‘వాతావరణం చల్లబడే వరకు’ కాలక్షేపం చేస్తోంది.
వైసీపిలో అందరి కంటే ముందుగా మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటమి షాకు నుంచి తేరుకున్నట్లున్నారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రజల తీర్పుని మేము స్వీకరిస్తున్నాము.
టిడిపి కూటమి కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. మేము అమరావతిని వద్దనుకోలేదు. దాంతోపాటు విశాఖ, కర్నూలుని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పాము. కానీ అది ప్రజలకు తప్పుగా చేరింది. మేము చేపట్టిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాము.
రాజకీయాలలో గెలుపోటములు సహజమే. మేము ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన్న పోరాడేందుకు సిద్దంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే రాష్ట్రంలో కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. వీటిపై కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుతున్నాము,” అని అన్నారు.
ప్రజలు భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పుడు వైసీపి ఇష్టారాజ్యం చేసిందే తప్ప ప్రజల ఆకాంక్షలు, సమస్యలు వేటినీ పట్టించుకోలేదు. 175 సీట్లు మాకే అని గొప్పలు చెప్పుకున్న వైసీపికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారంటే ప్రజలు వైసీపిని ఎంతగా అసహ్యించుకున్నారో అర్దం చేసుకోవచ్చు. అందుకు సిగ్గు పడాల్సిన గుడివాడ అమర్నాథ్ నిసిగ్గుగా ప్రజల పక్షాన్న పోరాడుతామని చెప్పుకుంటున్నారు.
5 ఏళ్ళు సంక్షేమ పధకాలతో కాలక్షేపం చేసేసి ఎన్నికలకు ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వాటిని టిడిపి కూటమి పూర్తి చేయాలని కోరడం సిగ్గుచేటు. ఇవే పనులను వైసీపి అధికారంలోకి వచ్చిన రోజునే మొదలుపెట్టి పూర్తిచేసి ఉండొచ్చు కదా?
టిడిపి కూటమి నేటికీ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, దాడులు జరుగుతుంటే వాటికి ఆయనే బాధ్యత వహించాలి కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయని చంద్రబాబు నాయుడు ఎలా బాధ్యుడు అవుతారు?




