ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం!

MP Galla Jayadev

ప్రముఖ పారిశ్రామికవేత్త, గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ఈరోజు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం టిడిపికి చాలా ఇబ్బందికరమే కానీ ఈవిషయాన్ని ఆయన చాలాకాలం క్రితమే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్పారు. కనుక టిడిపి ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు సిద్దంగానే ఉందని భావించవచ్చు.

ఆదివారం గుంటూరులో ప్రెస్‌మీట్‌లో ఆయన ఏమన్నారంటే, “పార్ట్ టైమ్ బిజినెస్ చేయవచ్చు కానీ పార్ట్ టైమ్ రాజకీయాలు చేయలేము. ఓ వైపు పరిశ్రమలు నడిపించుకుంటూ రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించడం కష్టంగా ఉంది.

ADVERTISEMENT

నాకు ఎంపీగా అవకాశం కల్పించిన టిడిపికి, నన్ను గెలిపించిన ప్రజలకు పూర్తి న్యాయం చేయలేనందుకు బాధపడుతూనే ఉన్నాను.

పార్లమెంటులో 24శాతం మంది నా వంటి వ్యాపారవేత్తలే ఉన్నారు. వారికి ఇదేమీ ఇబ్బందిగా అనిపించకపోయి ఉండవచ్చు. కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను పూర్తి న్యాయం చేయలేకపోతున్నానే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది.

నేను ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగానే పోరాడానని భావిస్తున్నాను. కానీ అంతకు మించి పోరాడాల్సి ఉందని కూడా నాకు తెలుసు. అలాచేస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోవడం చాలా కష్టం. అలాగని పార్లమెంటు చివరి బెంచీలలో మౌనంగా కూర్చొని కాలక్షేపం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాను.

నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఓ పారిశ్రామికవేత్తగా కూడా వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశానికి ఉపయోగపడగలను. కనుక ఇకపై నా పరిశ్రమలు, వ్యాపారాలకే పరిమితం అవుదామని నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం రాజకీయాలకు దూరం అవుతున్నప్పటికీ భవిష్యత్‌లో మళ్ళీ వెనక్కు వస్తాను. అప్పుడు నేను పూర్తిసమయం రాజకీయాలకే కేటాయించి మరింత నిబద్దతతో పనిచేస్తాను.

ఇంతకాలం నన్ను ఆదరించి, గౌరవించిన టిడిపికి, మా అధినేత చంద్రబాబు నాయుడుకి, నాకు ఎంతగానో సహకరించిన టిడిపి నేతలకు, నన్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించిన గుంటూరు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని గల్లా జయదేవ్ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories