ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చెయ్యడానికే జీవీఎల్ నరసింహరావుకు రాజ్యసభ పదవి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా రోజూ క్రమం తప్పకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పేసి వెళ్తున్నారు. తాజాగా అమరావతిలో అక్రమాలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైందని జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అభద్రతా భావంతో భాజపా నాయకుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేస్తోందని… సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో బయటకొచ్చిన ఫోన్ సంభాషణలు సీబీఐ, ఈడీ దర్యాప్తులో భాగమయ్యే అవకాశముందన్నారు.
రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేదన్నారు. చేయని పనులను చేసినట్లు చూపారని ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు అందాయని చెప్పారు. అంతా బానే ఉంది. ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది. మరోవైపు ఇప్పుడు చంద్రబాబు బద్దశత్రువు అయిపోయాడు. మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరు ఆపుతున్నారు?



