పచ్చ మీడియా అనే పదాన్ని గత రెండుదశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వాడుతున్నారు కొందరు. దీని పూర్వాపరాల్లోకి వెళ్లి చూస్తే, అసలు ఎల్లో జర్నలిజం అనే పేరుతో ఇంగ్లిషులో ఉన్న ఈ పదాన్ని ఎవరిని ఉద్దేశించి కనిపెట్టారో వాళ్ళే దీన్ని ఇతరులపై వాడటమే ఇక్కడ మహా వెటకారం.
చంద్రబాబు గోబెల్స్ అని, పచ్చ మీడియా ద్వారా రెండు రాష్ట్రాలను కంట్రోల్ చేసేస్తున్నాడు అని మొదలుపెట్టిన ఈ ప్రచారం ఇప్పుడు శ్రుతిమించి వెర్రితలలు వేస్తోంది. నిజానిజాలు చెప్పే ఓపిక చరిత్ర తెలిసినవారికి లేక, తెలుసుకునే తీరిక ఇప్పటి జనాలకి లేక ఈ పిచ్చిప్రచారమే వాస్తవంలా చలామణీ అవుతోంది.
1982 లో తెలుగుదేశం పుట్టేనాటికి ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి తెలుగులో మెయిన్ స్ట్రీమ్ దినపత్రికలు. ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్రానికల్ ఇంగ్లీషు దినపత్రికలు. కాశీనాథుని నాగేశ్వరావుగారు స్థాపించిన ఆంధ్రపత్రికను, ఆయన చనిపోయాక ఆయన అల్లుడు, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన శివలెంక శంభుప్రసాద్, ఆయన తర్వాత ఆయన వారసులు నడిపారు. అది మద్రాస్ ప్రధానకేంద్రంగా ప్రచురించబడేది. అంటే అరవయ్యో దశకంలో హయ్యస్ట్ సర్క్యులేటె్‌డ్ ఆంధ్రపత్రిక కాంగ్రెస్ పార్టీవారిది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక యజమాని కె.ఎల్.ఎన్ ప్రసాద్ కూడా 1970 నుండి 1987 దాకా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీయే. ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ దినపత్రికల యజమాని తిక్కవరపు చంద్రశేఖర రెడ్డి. ఈయన కూడా 1981-1983 వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలు రామనాథ గోయెంకా గ్రూపువారివి. హిందూ పత్రిక మద్రాస్‌నుండి ప్రచురితమయ్యే ఇంగ్లీష్ పత్రిక. విశాలాంధ్ర, ప్రజాశక్తి దినపత్రికలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల దినపత్రికలు. ఈ ప్రధాన పత్రికలే కాకుండా ఇంకో డజన్ చిన్నాచితక దినపత్రికలు ఉండేవి.
దినపత్రికలతోబాటు, ఈనాడువారి సితార, ఆంధ్రజ్యోతివారి జ్యోతిచిత్ర ప్రధాన సినిమా వారపత్రికలు. జ్యోతిచిత్ర అగ్రస్థానంలో ఉండేది. ఆంధ్రజ్యోతికి బాలజ్యోతి అనే పిల్లల మాసపత్రిక కూడా ఉండేది. బాగా నడిచేది. ఇవి కాక వీక్లీల హవా నడుస్తున్న ఆ కాలంలో ఈ దినపత్రికల సంస్థలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రసచిత్రవారపత్రిక, ఆంధ్రభూమి అనే పేర్లతో వీక్లీ మాగజైన్లు కూడా పబ్లిష్ చేసేవి.
ఈనాడు మొదలయ్యే సమయానికే, ఆంధ్రప్రభ దెబ్బకి ఆంధ్రపత్రిక దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్ భజనపత్రికలను జనాలు ఆదరించడం తగ్గిపోయింది అనడానికి ఆంధ్రప్రభకి లభించిన ఆదరణే సాక్ష్యం. తర్వాత, ఈనాడు ఎంట్రీతో అప్పటి వరకు మూసలో సాగుతున్న దిన పత్రికల పద్ధతుల్లో పెనుమార్పులు రావడంవల్ల, ప్రజలు ఈనాడు దినపత్రికను విపరీతంగా ఆదరించారు. ఇక సర్క్యులేషన్ విషయంలో ఈనాడుకు, ఆంధ్రప్రభకు మధ్య పోటీ ప్రారంభమయింది. 1974 కి ఇరవయివేల ముద్రణ కెపాసిటీ తో మొదలు అయ్యిన ఈనాడు ప్రస్థానం 1979కి ఒక లక్షా ఎనభయివేలకి చేరింది. 1983 ఎన్నికల నాటికి ఈనాడు సర్క్యులేషన్ దాదాపుగా మూడులక్షలకి చేరుకుంది. తెలంగాణ, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర ఉద్యమాలు, ఎమర్జెన్సీ అనంతరం ప్రజల్లో పెరిగిన రాజకీయచైతన్యం కూడా తెలుగునాట పత్రికాపఠనం పట్ల ఆసక్తిని పెంచడానికి దోహదపడింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతశాతంలో పెరుగుదల కేవలం ఆరుశాతంగా నమోదయిన ఈ కాలంలోనే దినపత్రికల పాఠకులసంఖ్య 70 శాతం పెరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే, నవలా ప్రపంచంలో రొటీన్ రొడ్డకొట్టుడు తరహా సాహిత్యంనుండి యండమూరి కలిగించిన విముక్తి లాంటిదే ఈనాడు క్రియేట్ చేసింది కూడా.
ఇలాంటి సమయంలో, ప్రతి ఐదేళ్ళకీ సర్క్యులేషన్ రెట్టింపవుతున్న మీడియాసామ్రాజ్యానికి, ఇతర వ్యాపారాలకు పునాది వేసుకుంటున్న ఏ ఔత్సాహిక వ్యాపారవేత్త కూడా కులపిచ్చితోనో, మరొక పిచ్చితోనో అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడే వెర్రిసాహసం చేయడు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిర సంగతి, కాంగ్రెస్ సంగతి తెలిసి కూడా రామోజీరావు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నాడు. అంటే జనంలో ఏర్పడిన కాంగ్రెస్ వ్యతిరేకతకు భిన్నంగా వెళ్లి, తన వ్యక్తిగత ఇమేజ్, క్రెడిబిలిటీలను దెబ్బతీసుకుంటే, వ్యాపారం కూడా దెబ్బతింటుంది అని లెక్క ఉంది కాబట్టే, రామోజీరావు అప్పటి ప్రజాభిప్రాయాన్ని అనుసరించి కాంగ్రెస్‌ని వ్యతిరేకించాడు అనేది స్పష్టం. తర్వాత రోజుల్లో కూడా జనంలో సమ్మతి ఉంది, ఆదరణ వస్తోంది అనుకున్న ప్రతిసారీ ఎన్టీయార్ మీద ఎడాపెడా కార్టూన్లు, వ్యంగ్యరచనలు వదిలిన చరిత్ర ఈనాడుకి ఉంది. ఆ విషయం ముందు ముందు మాట్లాడుకుందాం.
ఇక 1982-83 తెలుగుదేశం ప్రభంజనకాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఒకపక్క తెలుగుదేశానికి ఈనాడు దినపత్రిక పరోక్షంగా సహకరించింది అనుకుంటే కూడా, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు చెందిన మూడు దినపత్రికలు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, వాటితోబాటు డెక్కన్ క్రానికల్ ఇంగ్లిష్ దినపత్రిక కాంగ్రెస్ పార్టీకి డైరెక్టుగా ప్రచారం చేసి, బాకాలూది, సహకారం అందించాయనే వాస్తవం స్పష్టంగా అర్ధమవుతోంది. అదే సమయంలో ఉభయకమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశంపార్టీని వ్యతిరేకించడం వలన వారి దినపత్రికలైన విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వార్తలు రాశాయి. ఈనాడుతో ఉన్న పోటీవలన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు తమ కాంగ్రెస్ వ్యతిరేకతను కొనసాగిస్తూనే, తెలుగుదేశంపట్ల తటస్థంగా వ్యవహరించాయి.
తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆరు దినపత్రికలు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి, డెక్కన్ క్రానికల్ ముఠాకట్టి యుద్ధం చేస్తే, తెలుగుదేశం పార్టీకి సహకరించిన ఒకే ఒక పత్రిక ఈనాడు మాత్రమే. దీన్నిబట్టే అర్ధమవట్లేదా వాస్తవంగా ఆనాడు మీడియా మాఫియాముఠాలను ఎవరు నడిపారో ? పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాన్ని, ఇతర వ్యాపారాల్ని, పరిశ్రమల్ని, ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని డైరక్ట్‌గా కాంగ్రెస్ ఎంపీలే నడిపిన ఈ పత్రికాసంస్థలు, ఇతర చిన్నాచితకా పత్రికల్ని, జర్నలిస్టులను, రచయితలనూ నయానోభయానో, డబ్బులతోనో ఎలా లోబర్చుకొని అసత్యాలను, కులగజ్జి వార్తలను వండివార్చి రాశారో, రాయించారో అర్ధమవట్లేదా ? నిజానికి అవి తెలియడానికి నాలుగు దశాబ్దాలు వెనక్కివెళ్లి చూడక్కర్లేదు కూడా. ఇప్పుడు నడుస్తున్నచరిత్రే దానికి “సాక్షి”.
1983 లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక పత్రికాలోకంలో జరిగిన పరిణామాల గురించి మరొక్క సారి మాట్లాడుకుందాం.
కళ్యాణ్ చక్రవర్తి.వి



