హోర్మూజ్ నుంచి అమెరికా పాఠం నేర్చుకోలేదా?

hormuz-crisis-donald-trump

ప్రపంచ చమురు, గ్యాస్, సరుకు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి ఇరాన్‌ అధీనంలో ఉంది. దానిని స్వాధీనం చేసుకునేందుకు, తెరిపించేందుకు ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మిత్రదేశాలను పిలిస్తే ముందుకు రాలేదు.

దాంతో అమెరికా ఒంటరిగానే దానిని తెరిపించగలదని ట్రంప్‌ ప్రగల్భాలు పలికారు. కానీ తెరిపించలేకపోయారు. దాంతో 48 గంటల్లో హోర్మూజ్ జలసంధి ని తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసి నేలమట్టం చేస్తామని బెదిరించారు.

ADVERTISEMENT

కానీ ఇరాన్‌ కూడా అంతకు అంతా దీటుగా ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించడంతో ట్రంప్‌ 48 గంటల గడువుని 5 రోజులకు పెంచి ఇరాన్‌తో శాంతి చర్చలంటున్నారు. అంటే హోర్మూజ్ విషయంలో ట్రంప్‌ ఫెయిల్ అయ్యారని అర్ధమవుతూనే ఉంది.

కనుక ట్రంప్‌ శాంతి చర్చల పేరుతో ఈ యుద్ధం నుంచి గౌరవంగా బయటపడే మార్గం కోసం వెతుకుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఇరాన్‌ని రెచ్చగొట్టకూడదు కదా? కానీ దానికి అత్యంత కీలకమైన ఖర్గ్ ఐల్యాండ్ స్వాధీనం చేసుకోవడం గురించి ఆలోచనలు చేస్తున్నారు. అంటే హోర్మూజ్ నుంచి ట్రంప్‌ ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న మాట!

హోర్మూజ్ విషయంలో ఇరాన్‌ ఏవిధంగా స్పందించిందో, ఇప్పుడు ఖర్గ్ ఐల్యాండ్ విషయంలో కూడా అలాగే స్పందించింది. ఖర్గ్ ఐల్యాండ్ వైపు అమెరికా ఒక్క అడుగువేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది. పశ్చిమాసియా దేశాలలోని కీలక ప్రాంతాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.

అంతేకాదు.. ఖర్గ్ ఐల్యాండ్‌, దాని చుట్టూ ఉన్న సముద్రంలో ఏర్పాటు చేసిన భారీ మైన్లతో అమెరికాకు పెద్ద ఉచ్చుని సిద్ధం చేస్తోంది.

అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ, సైనిక సంపత్తి ముందు ఇరాన్‌ ఉచ్చులు నిలువకపోవచ్చు. కానీ ఈ ప్రయత్నంలో అమెరికా దళాలు, పశ్చిమాసియా దేశాలు భారీగా మూల్యం చెల్లించాల్సి రావచ్చు. కనుక ట్రంప్‌ ఇరాన్‌ని ఓడించేశామని చెప్పుకుంటూ మెల్లగా వెనుతిరగడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories