ఏపీలో విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. కానీ అడుగు ముందుకు వేసే ముందు ఓసారి హైదరాబాద్ మెట్రో పరిస్థితిని నిశితంగా గమనిస్తే మంచిది.
హైదరాబాద్ మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకు సుమారు 4-4.50 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కనుక మెట్రో రైళ్ళన్నీ ఎల్లప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. అయినా భారీగా నష్టాలు వస్తున్నాయి. ఈ కారణంగా మెట్రోని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్&టి కంపెనీ ఈ ప్రాజెక్టును అమ్మేసి బయట పడాలనుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో ఆస్తుల విలువ మొత్తం రూ. 15,920.22 కోట్లు. ఎల్&టి కంపెనీ కేవలం మెట్రో రైళ్ళ ద్వారా వచ్చిన ఆదాయంతో నిర్వహణ ఖర్చులు, అప్పులు, వడ్డీలు చెల్లించే పరిస్థితి ఉండదు.
కనుక అప్పటి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ముషీరాబాద్‌లో ఆ సంస్థకు 269 ఎకరాలు 60 ఏళ్ళ లీజుపై ఇచ్చింది. వాటిలో ఎల్&టి కంపెనీ భారీ షాపింగ్ మాల్స్, ఐటి కార్యాలయాలు నిర్మించి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది.
మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. కనుక కొంత అదనపు ఆదాయం కూడా వస్తోంది.
మెట్రో నిర్వహణ వ్యయం ఏడాదికి రూ.400 కోట్లు కాగా 2024-25లో రూ.1,108.54 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే ఒకవేళ అప్పులు, వడ్డీలు లేకపోయి ఉంటే హైదరాబాద్ మెట్రో ఏడాదికి సుమారు రూ.600 కోట్లు లాభాలు ఆర్జించి ఉండేది.
కానీ మెట్రో నిర్మాణం కొరకు చేసిన అప్పులు రూ.9,982 కోట్లు కాగా దానికి 7 నుంచి 10 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ. 4,500 కోట్లు అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించింది. కానీ అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి. ఎల్&టి కంపెనీ ఆదాయం అప్పులు, వడ్డీలకే సరిపోతోంది.
హైదరాబాద్ మెట్రో ప్రారంభించినప్పటి నుంచి 2025 జూన్ వరకు మొత్తం రూ.6,605.51 కోట్లు నష్టం వచ్చిందని ఎల్&టి కంపెనీ నివేదికలో పేర్కొంది. ఈ 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.626 .31 కోట్లు నష్టపోయిందని పేర్కొంది.
హైదరాబాద్ మెట్రోలో రోజుకి సుమారు 4-4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నా, ఇన్ని వేలకోట్ల ఆస్తులున్నా నష్టాల ఊబిలో కూరుకుపోతోంది.
దాని పరిస్థితి చూస్తున్నప్పుడు, విజయవాడ, విశాఖ మెట్రో పరిస్థితి ఏమిటనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే ఈ రెండు మెట్రోలు కూడా సుమారు రూ.12,000 కోట్ల రుణాలతో నిర్మించబోతున్నారు. ఈ రెండు మెట్రోలలో రోజుకి 4.50 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తారా? లేకపోతే పరిస్థితి ఏమిటి?
హైదరాబాద్ మెట్రో ఈ చరిత్ర ఏపీలో పునరావృతం కాకుండా ఏపీ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోబోతోంది? అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చాలా అవసరం!




