తమ ప్రేమయం లేకుండా జరిగిన ఒక సంఘటన ఒక కుటుంబాన్నే సర్వనాశనం చేసేసింది. విధి వైపరీత్యమే అని భావించాల్సి వస్తే… స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాలనుకోవడమే ఆ పాప చేసిన నేరమా? లేక తమ గారాలపట్టిని విద్యాలయం నుండి స్వయంగా దగ్గరుండి ఇంటిని తీసుకువెళ్ళడానికి స్కూల్ కు వెళ్ళడమే ఆ చిన్నారి కుటుంబ సభ్యులు చేసిన నేరమా? డబ్బున్న అహంకారంతో తప్పతాగి, కన్నుమిన్ను కానకుండా, మదమెక్కిన మృగాలు నాలుగు చక్రాల వాహనాల్లో తిరుగుతారని తెలియని అభాగ్యులకు విధి నేడు అందించిన మూడో బహుమానమా?
అవును… హైదరాబాద్ లో జూలై 1వ తేదీన జరిగిన ఒక యాక్సిడెంట్ గురించే ఇదంతా..! చిన్నారి రమ్యను స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళిన బాబాయ్ రాజేష్ ను పంజాగుట్ట సెంటర్లోనే ప్రాణాలు వదిలాడు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగం నిమిత్తం విదేశాలను వెళ్ళాలనుకున్న రాజేష్, అనంత లోకాలను వెళ్ళిపోవడంతో కుటుంబానికి కన్నీరే శరణ్యమైంది. ఇక, కారులో ఉన్న చిన్నారి తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె కూడా తన బాబాయ్ దగ్గరకు వెళ్లిపోవడంతో… ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా మూగబోయింది.
నేడు… చిన్నారి తాత మధుసూదనాచారి కూడా అదే బాటలో పయనించడంతో… బరువెక్కిన ఆ గుండెలు ఆగ్రహంతో కట్టలు తెంచుకున్నాయి. ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోవడంతో… మాటలే తూటాలుగా వదులుతూ రగిలిపోతున్నారు. చట్టపరంగా ప్రభుత్వం శిక్షులను దండిస్తుందా? లేక మమ్ములనే దండించమంటారా? అంటూ తమ కడుపుకోతలను మీడియా వేదికలుగా బహిరంగ పరుస్తున్నారు. అవును… వారి ఆగ్రహంలో ఒక అర్ధం ఉంది… భరించలేనంత ఆవేదన చాలా ఉంది..!
తమ మానాన తాము రోడ్డు పైనే పయనిస్తూ ఉంటే… కండకావరంతో కళ్ళు నెత్తిమీద పెట్టుకుని వాహనాలు నడిపే వారిని అదే పంజాగుట్ట సెంటర్లో నడిరోడ్డుపైన ఉరి తీయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారంటే… వారి గుండెబరువు ఏ స్థాయిలో ఉందో మనిషన్న ప్రతివాడు అర్ధం చేసుకోవచ్చు. ఓ పక్కన కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా కోల్పోతూ అంత్యక్రియలు చేసుకోవాలా?… మరో పక్కన జీవిచ్చవంలా ఆసుపత్రిలో పడి ఉన్న భార్య (చిన్నారి రమ్య తల్లి)ను చూసుకోవాలా? అంటూ రమ్య తండ్రి వేస్తున్న ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు?
అందుకే నడిరోడ్డులో ఆ మదమెక్కిన మృగాలను ఉరి తీసే వరకు ఆసుపత్రి నుండి శవాన్ని తీసుకెళ్ళమని రమ్య బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. మీరు ఎన్ కౌంటర్ చేయలేరంటే చెప్పండి… వారిని తాము చంపి ఎలాంటి శిక్షకైనా వెళ్తామని మీడియా వేదికగా తమ ఆక్రోశాలను ప్రదర్శిస్తున్నారు. వీరి ఆగ్రహలకు, ఆవేశాలకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మరింత ఊతమిచ్చే విధంగా ఉన్నాయని మీడియా వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
గతంలో విజయవాడ వేదికగా జరిగిన ఓ కిడ్నాప్ లో చిన్నారిని స్వయానా బంధువే సజీవ దహనం చేయగా, మరికొద్ది రోజులకే ఆ బాధను తట్టుకోలేక తండ్రి గుండెపోటుతో కాలం చేసాడు. అందులో ఎలాంటి న్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. అప్పుడు మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే కాలంతో పాటు ఆ సజీవ దహనాన్ని, ఆ కేసులో జరిగిన (అ)న్యాయాన్ని అప్పుడే తగలబెట్టేసారు. మరి ఈ ఉదంతంలోనైనా సరైన న్యాయం జరుగుతుందని ఎవరైనా గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా?
సాక్ష్యం మాత్రమే పరిగణనలోకి తీసుకునే చట్టాలకు… నిజంగా అది కనపడనిస్తారా..? ప్రస్తుతం కోపావేశాలతో ఉన్న కుటుంబ సభ్యులు కాలక్రమేణా ఇది తమ “విధి రాత” అని తమను తాము సరిబూచ్చుకోవడం తప్ప… ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుతుందని భావిస్తారా? కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు చెప్తున్న మాటలు కార్యరూపం సిద్ధించుకుంటాయా? కాలమే వీటికి సమాధానం చెప్పాలి.



