మహారాష్ట్ర ప్రభుత్వం, దాదాపుగా పక్షం రోజుల క్రితం, సినిమాలు మరియు టెలివిజన్ షోల చిత్రీకరణకు అనుమతించింది. కానీ కఠినమైన షరతుల కారణంగా ఇప్పటివరకూ ఏమీ ప్రారంభించలేదు.అలాగే భారతదేశంలో కరోనా కేసుల కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో షూటింగ్ గురించి నటులు, చిత్రనిర్మాతలు భయంగా ఉన్నారని కొందరు అంటున్నారు.
కాబట్టి, బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ షూటింగుల కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీపై దృష్టి సారించారు. హైదరాబాద్ శివార్లలో ఉండటంతో ఇక్కడ రిస్క్ తక్కువని వారి అభిప్రాయం. జాన్ అబ్రహం మరియు ఎమ్రాన్ హష్మి నటించిన ముంబై సాగా అనే సినెమా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబోయే మొదటి చిత్రం.
ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జూలై మధ్య నుండి ప్లాన్ చేస్తున్నారు. సినిమా కోసం అక్కడ రెండు సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజుల చిత్రం షూటింగ్ జరుగుతుంది. కరోనావైరస్ ప్రేరిత లాక్డౌన్కు ముందు ముంబై సాగా యొక్క 90% షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్ సమయంలో, దర్శకుడు సంజయ్ గుప్తా మరియు అతని బృందం ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కోసం పనిచేశారు.
మరిన్ని బాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిలిం సిటీ వైపు చూస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొంతమంది అక్కడ షూటింగ్ కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఈ నెలాఖరు నుండి గానీ జులై మొదటి వారం నుండి గానీ అక్కడ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.





