ఏ అధికారి అయినా ప్రభుత్వాలకు లోబడి పనిచేయాల్సిందే. అయితే లోబడి అంటే దాసోహం అని కాదు. నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా విధులు నిర్వహించడమే. కానీ జగన్ పాలనలో చాలా మంది అధికారులు వైసీపి కండువా కప్పుకోవడం ఒక్కటే తక్కువన్నట్లు వీరవిధేయంగా వ్యవహరిస్తూ, అది చేసే తప్పుడు నిర్ణయాలన్నిటినీ గుడ్డిగా అమలుచేశారు.
అలాగే వైసీపి రాజకీయ కక్షలకు పావులుగా మారి టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధించారు. వారు ఎవరిని చూసుకొని పేట్రేగిపోయారో ఇప్పుడు ఆ జగన్, వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారంలో లేరు.
జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు దులుపుకుని వెళ్లిపోతే వారి కోసం తప్పులు చేసిన అధికారులు అందరూ ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొంది. కనుక అప్పుడే పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సెలవు పెట్టి విదేశాలకు లేదా తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మరికొందరు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు.
ముందుగా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించి, అరెస్ట్ చేసి జైలుకి పంపించిన ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వచ్చే నెల 3వరకు సెలవు పెట్టగా సిఎస్ జవహార్ రెడ్డి వెంటనే మంజూరు చేశారు. సంజయ్ అమెరికా వెళ్ళిపోతున్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వం తరపున ఈ కేసులన్నీ వాదించిన అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కొంతమంది ప్రభుత్వ న్యాయవాదులు కూడా రాజీనామాలు చేసిన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి మంగళవారమే తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు దానిని ఆమోదించలేదు. కనుక ఈ నెల 5 నుంచి 19వరకు సెలవు మంజూరు చేశారు.
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పంపించారు. కానీ ఆయన నేటి నుంచి 10 రోజులు సెలవుపై వెళుతున్నారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు కనుక అంతవరకు ఆయన కూడా సెలవు పొడిగించవచ్చు.
జగన్, మంత్రులు మంగళవారం సాయంత్రమే తమ పదవులకు రాజీనామాలు చేసి గవర్నర్‌కు పంపించగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మంగా సాగాలని సూచించారు.
వారు రాజీనామాలు చేయడంతో సుమారు 40-50 మంది సలహాదారులు, వివిద కార్పొరేషన్ల చైర్మన్లు కూడా రాజీనామాలకు సిద్దం అవుతున్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి, మాజీ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటలిజన్స్ అధిపతి ఆంజనేయులు తదితరుల సంగతి చంద్రబాబు నాయుడు స్వయంగా తేల్చనున్నారు.




