దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. వాటిని నడిపే రాజకీయ పార్టీలదే. కానీ అవి యువత కంటే తమ తమ పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే పదవులు కల్పించుకొనేందుకు రకరకాల పదవులు సృష్టిస్తూ పార్టీలో నిరుద్యోగం తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటాయి. శాసనసభ నియోజకవర్గాలు పెంచాలనే డిమాండ్ కూడా అటువంటిదే.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన కె.పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఓ రిట్ పిటిషన్ వేశారు. ఆయన ఏమి కోరారంటే, జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నందున, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శాసనసభ నియోజకవర్గాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225కి, తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిగా కోరుతూ సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు దీనిని విచారణకు స్వీకరించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రజా ప్రతినిధులకు తమతమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని, ప్రజలకు సేవ చేయాలనే తపన, నిబద్దత లేకపోవడం వలననే నేడు దేశం ఈవిదంగా ఉంది తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నందున కాదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో చాలామంది ప్రజలకు అందుబాటులో ఉండరు. వారి దృష్టి ఎప్పుడూ పదవులు, అధికారం, కాంట్రాక్టులు, కమీషన్లు, రాజకీయాలపైనే ఉంటుంది తప్ప ప్రజలు, నియోజకవర్గాలపై కాదు.
కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేతలందరూ తమ తమ నియోజకవర్గాలపై పూర్తి పట్టుకలిగి ఉంటారు లేదా పట్టు సాధించడం కోసం పరస్పరం కొట్లాడుకొంటుంటారు. ఓ నియోజకవర్గంపై రాజకీయంగా పట్టు ఉన్నపుడు నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చేయడం లేదు?ప్రజల ఓట్లు ఆశిస్తున్నప్పుడు వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదు?అంటే తపన, చిత్తశుద్ధి లేకపోవడం వలననే అని అర్దమవుతోంది. మరి ఇటువంటి ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉంటే మాత్రం ఏం ప్రయోజనం?
నియోజకవర్గాలకు వారు ఏమీ చేయకపోయినా పట్టు సాధించేందుకు ఎందుకు కీచులాడుకొంటారు?అంటే రాజకీయ నిరుద్యోగం వలననే అని చెప్పవచ్చు. వారి కీచులాటల వలన పార్టీలకు రాజకీయంగా నష్టం కలుగుతుంది కనుకనే వారందరికీ ఏవో పదవులు సృష్టించి కట్టబెడుతుంటాయి. కానీ అవీ సరిపోవడం లేదు కనుక నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు చెప్పవచ్చు.
నియోజకవర్గాలు పెరిగితే శాసనసభ్యుల సంఖ్య పెరుగుతుంది. దాంతోబాటే శాసనమండలి సభ్యుల సంఖ్య, మంత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది. కనుక ఎక్కువమంది రాజకీయనాయకులకు ఉద్యోగాలు అంటే పదవులు లభిస్తాయన్న మాట!
కానీ ఆమేరకు ఎన్నికల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య పెరిగితే వారి జీతభత్యాలు, వాహనాలు, వారి పర్యటనల ఖర్చులు, వారికి కార్యాలయాలు, సిబ్బంది, సెక్యూరిటీ తదితర ఖర్చుల భారం అంతా ప్రజలపైనే పడుతుంది. కనుక ఈ ప్రతిపాదన వలన రాజకీయ పార్టీలకే తప్ప ప్రజలకు భారమే తప్ప కొత్తగా ఒరిగేదేమీ ఉండదనే చెప్పవచ్చు. కానీ కర్రున్నవాడిదే బర్రె కనుక అధికారంలో ఉన్నవారు ఏమి తలుచుకొంటే అదే జరుగుతుంది. దానిని ప్రజలు శిరసావహించకతప్పదు. కనుక ఈ భారం భరించేందుకు సిద్దంగా ఉండక తప్పదు.
Exclusive Video Interviews: Watch & Subscribe



