భారత్‌కి ప్రజల మద్దతు ఉంది.. మరి పాక్ ప్రభుత్వానికి?

India Pakistan

పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులపై దాడి చేయకుంటే భారత్‌-పాక్ మద్య నేడు ఈ ఉద్రిక్తతలు ఏర్పడేవే కావు.

తమ ఉగ్రవాదుల వలన భారత్‌ గాయపడింది కనుక దాని ఆంక్షలు, నిర్ణయాల పట్ల కాస్త సంయమనం పాటించి ఉంటే హుందాగా ఉండేది. పాక్ పాలకులే చొరవ తీసుకొని తమ తప్పిదం వలన ఏర్పడిన ఈ పరిస్థితిని చక్క దిద్దేందుకు ప్రయత్నించి ఉంటే దాని మిత్ర దేశాలు కూడా దానికి సహకరించేవి.

ADVERTISEMENT

కానీ తమ తప్పిదాలకు పాక్ పాలకులు ఏమాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయకపోగా, భారత్‌కు ధీటుగా ఆంక్షలు విధిస్తున్నారు. సింధూనదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే దానిలో భారతీయుల రక్తం ఏరులై ప్రవహిస్తుందని, బాంబులతో పేల్చి వేస్తామని బెదిరిస్తున్నారు.

సరిహద్దుల వద్ద భారత్‌ పోస్టులు, గ్రామాలపై కాల్పులు జరుపుతున్నారు. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామంటున్నారు. పాక్ ఉగ్రవాదులు ఈవిదంగా మాట్లాడితే అర్దం చేసుకోవచ్చు. కానీ పాక్ మంత్రులు, దౌత్యవేత్తలు కూడా ఉగ్రవాదుల్లాగే మాట్లాడుతున్నారు.

ఇంత కాలం పాకిస్థాన్‌ ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేయిస్తుండటం యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాక్ మంత్రులు కూడా అణు బాంబులు వేసి భారత్‌ని నాశనం చేస్తామని బెదిరిస్తుండటం గమనిస్తే, ఉగ్రవాదుల వెనుక వారే ఉన్నారని అర్దమవుతోంది.

రష్యాలో పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీడ్ జమాలీ రష్యన్ టీవీ న్యూస్ ఛానల్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “భారత్‌ మీడియా చాలా బాధ్యతారాహిత్యంగా పాకిస్థాన్‌పై ఆరోపణలు చేస్తోంది. అందువల్ల మేము కూడా ధీటుగా స్పందించక తప్పడం లేదు.

పాకిస్థాన్‌లో కొన్ని ప్రాంతాలపై భారత్‌ దాడి చేయబోతోందనే సమాచారం మాకుంది. మాకు మా దేశ ప్రజల మద్దతు ఉంది. ఒకవేళ భారత్‌ దాడి చేస్తే మా వద్ద గల సాంప్రదాయ, అణ్వస్త్రాలతో పూర్తి స్థాయిలో ఎదుర్కొంటాము,” అని అన్నారు.

భారత్‌ మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న పాక్ పాలకులు, దౌత్యవేత్తలు భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని బెదిరించడం, సింధూ నదిలో భారతీయుల రక్తం ఏరులై పారిస్తామని బెదిరించడం బాధ్యతాయుతమేనా?

పాకిస్థాన్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి యావత్ దేశ ప్రజల మద్దతు ఉందన్న మాట! కానీ భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించాలంటున్న పాక్ పాలకులకు వారి ప్రజలు మద్దతు ఉందా?

పాక్ పాలకుల అవినీతి, అసమర్దత వల్లనే తాము తమ దేశం ఇంత దయనీయంగా ఉన్నామని పాక్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

కనుక పాక్ పాలకులు తమ అవినీతి, అసమర్ధతని కప్పి పుచ్చుకునేందుకే భారత్‌ని బూచిగా చూపిస్తూ ఇన్ని దశాబ్ధాలు గడిపేశారు. ఇప్పుడూ భారత్‌తో అణు యుద్ధం అంటూ తమ దేశ ప్రజలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే పాక్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఒకవేళ భారత్‌-పాక్ మద్య నిజంగానే యుద్ధం జరిగితే, భారత్‌ మళ్ళీ కొలుకోగలదేమో కానీ పాక్ ఇక ఎన్నటికీ కొల్కోలేదని వారికీ తెలుసు.

ADVERTISEMENT
Latest Stories