2011 లో క్రికెట్ ప్రపంచకప్పును అందుకున్న భారత్, వన్-డే మరియు టీ-20లలో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఆ ఫామ్ ను టెస్ట్ ఫార్మటు లో చూపలేక అటు విదేశ పిచ్లపైనా, అప్పుడప్పుడు సొంత పిచ్లపైనా తడబడుతూ భారత క్రికెట్ జట్టు టెస్ట్ లలో పతనం వైపుగా పరుగులు పెడుతుంది.
అటువంటి సమయంలో భారత లెజెండరీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ఇక టెస్ట్ లకు గుడ్ బాయ్ చెప్తూ, తరువాతి సారధిగా పగ్గాలను విరాట్ కోహ్లీ చేతిలో పెట్టారు. అయితే అప్పుడు తెలిసి ఉండదు అతనికి, తాను ఆరోజు చేసిన ఆ పని భారత్ టెస్ట్ మ్యాచ్లను ఆడే తీరునే మార్చబోతుందని.
ఇంటా, బయటా తేడా లేకుండా అగ్రెసివ్ క్రికెట్ కు బ్రాండ్ గా మారింది కోహ్లీ సేన. కేవలం అనవసరమైన అగ్రేషన్ తో కాకుండా, సమయానికి తగ్గ ఫైర్ తో అపోజిషన్ కంటికి కునుకు లేకుండా చేశారని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
ఇక నేడు మళ్ళీ టెస్ట్ లలో భారత్ అడుగులు పతనం వైపుగా వెళుతుంటే , ఇప్పుడు మరొకసారి అందరు 2015-22 భారత టెస్ట్ ఎరా ను స్మరించుకుంటున్నారు.
కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించిన 7 ఏళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్ట్-ఇండీస్, శ్రీలంక, బంగ్లా వంటి విదేశీ పిచ్ల పై కుడా భారత్ ఆధిపత్యాన్ని చలాయించింది.
ఇక హోమ్ సిరీస్ విషయానికి వస్తే సిరీస్ ఓడతామనే విషయం పక్కన పెడితే, 7 ఏళ్లలో కేవలం 2 మ్యాచ్లను ఓడి ఎవ్వరికి సాధ్యంకాని రీతిలో భారత్ ఒక టెస్ట్-లార్డ్ గా అవతారమెత్తింది.
అయితే, విరాట్ టెస్ట్ కెప్టెన్సీ కు రాజీనామా చేసినప్పటి నుండి, జనాలు టెస్ట్ ల ను చూసే విధానం కూడా మారింది. ఇక, ఇది చాలదన్నట్టు 2024 లో న్యూజిలాండ్ జట్టు పై వైట్-వాష్ కు గురి అయ్యి కనీసం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా అర్హత సాధించకుండానే నిష్క్రమించబడ్డారు.
ఆ పిమ్మట ఆస్ట్రేలియా వెళ్లి ఆ సిరీస్ లో కూడా ఘోరమైన ఆటతీరుతో సిరీస్ ను చేజార్చుకున్నారు. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న సిరీస్ లో కూడా భారత్ పూర్తిగా చేతులెత్తేసింది.
తొలి టెస్ట్ లో మెజారిటీ భాగంలో భారత జట్టే ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ ఆధిపత్యాన్ని ఒడిసి పట్టుకునే విషయంలో విఫలమై మ్యాచ్ ను కోల్పోగా, ఇక 2వ టెస్ట్ లో ప్రోటీయాస్ కంప్లీట్ డామినెన్స్ చూపిస్తున్నారు.
ఇప్పటికే 1-0 గా ఉన్న ఈ సిరీస్, రేపటితో ఓ కొలిక్కిరానుంది. ఇంకా బ్లూ టీం గెలుపుకి సుమారు 500 పరుగులు కొట్టాల్సి ఉండగా, ఇప్పటికే 2 వికెట్లను సమర్పించుకుని మ్యాచ్ డ్రా కి కూడా కష్టమే అనేలా ఓటమి అంచులలో వేలాడుతుంది. మరి చూడాలి ఆ ఓటమి ని ఆటగాళ్లు కాస్త వాయిదా వేయగలగరా.? లేదా అనేది.
ఇలా పదేళ్ల ముందు మ్యాచ్ ఓటమితో కాకుండా ‘డ్రా’ తో ముగిస్తే చాలు అని ఆశ పడే స్థాయికి భారత్ మళ్ళీ వచ్చిందని అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తపరుస్తున్నారు.






