ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కు టీమిండియా బ్యాట్స్ మెన్లు దాసోహం అన్నారు. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ మాదిరే రెండవ ఇన్నింగ్స్ లోనూ త్వరత్వరగా పెవిలియన్ చేరుకుని, కేవలం 130 పరుగులకే ఆలౌట్ కావడంతో, రెండున్నర్ర రోజులకే అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ రెండున్నర్ర రోజులలో కూడా తొలి రోజులో ఎక్కువ శాతం వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.
[m9ad]
మూడవ రోజున ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసి టీమిండియా బ్యాట్స్ మెన్లను బరిలోకి దింపింది, కెప్టెన్ వ్యూహం ఫలించింది. మూడవ ఓవర్ లో డకౌట్ తో ఆరంభమైన ఇన్నింగ్స్ పతనంలో 47వ ఓవర్ లో ఇషాంత్ శర్మ 2 పరుగులకు అవుట్ కావడంతో ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో 35 ఓవర్లు ఆడిన టీమిండియా, రెండవ ఇన్నింగ్స్ లో 47 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగించింది.
రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ను 2-0తో ఆధిపత్యంలో ఉంది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విమర్శలకు తావిచ్చింది. రెండవ ఇన్నింగ్స్ లో అయినా మంచి బ్యాటింగ్ ప్రతిభ కనపరిచి, ప్రేక్షకులకు టెస్ట్ మ్యాచ్ వినోదాన్ని ఇస్తారని భావిస్తే, అలాంటి వాటికి తావు లేకుండా మూడో రోజు కూడా ముగియకుండానే టెస్ట్ మ్యాచ్ ను ముగించేసారు.



