ఈ గెలుపు కూడా ఓ గెలుపేనా… ప్చ్..!

India Vs Zimbabwe T20ఒక వైపు క్రికెట్ పసికూనలు… మరో వైపు యంగ్ ఇండియా… అయినప్పటికీ టీమిండియాకు ముచ్చెమటలు పట్టించారు పసి కూనలు. వన్డేలలో కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేకపోయిన జింబాబ్వే జట్టు టీ 20లలో మాత్రం భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి టీ 20లో ఏకంగా విజయం సాధించగా, సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లోనూ దాదాపుగా గెలిచినంత పని చేసింది. దీంతో విజయం వరించినప్పటికీ, టీమిండియాలో ఆశించినంత సంతోషం లేకపోయింది.

ADVERTISEMENT

కీలకమైన మూడవ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 138 పరుగులు మాత్రమే నమోదు చేసింది. కెప్టెన్ ధోనితో సహా బ్యాట్స్ మెన్లంతా విఫలం కాగా, జాదవ్ ఒక్కడే 42 బంతుల్లో 58 పరుగులతో సత్తా చాటాడు. అలాగే చివర్లో అక్సర్ పటేల్ 11 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా నమోదు చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను తొలి ఓవర్లలో కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

అయితే ఒత్తిడిని జయించలేక వికెట్లు సమర్పించుకుని ఓటమిని కొనితెచ్చుకుంది జింబాబ్వే. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు కావాల్సి ఉన్న తరుణంలో… ఇక మ్యాచ్ ఇండియాదే అని భావించగా, అంతా అవాక్కయ్యేలా ఏకంగా 17 పరుగులు సాధించి భారత్ కు ముచ్చెమటలు పట్టించారు. మొదటి బంతిని సిక్సర్, ఆపై ఒక నో బాల్, తదుపరి బంతికి అయిదు పరుగులు వచ్చిన తర్వాత రెండు డాట్ బాల్స్ పడ్డాయి. అయితే అయిదవ బాల్ ను బౌండరీగా మలచడంతో, చివరి బంతికి ఒక ఫోర్ అవసరమైన సమయంలో, వికెట్ పడడంతో కేవలం 3 పరుగులతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

‘చావు తప్పి కన్ను లొట్టబోయింది’ అన్నట్లుగా మారింది టీమిండియా పరిస్థితి. జింబాబ్వేనే కదా అని లైట్ గా తీసుకున్న ధోని సేనకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. జింబాబ్వే వంటి టీంపై కూడా చచ్చిచెడి గెలవడం కూడా ఒక గెలుపేనా అంటూ నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు. వన్డేలలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, టీ20లలో మాత్రం బెదరక తప్పలేదు. అయితే యంగ్ టీంతో వన్డే, టీ20 సిరీస్ లను గెలుచుకుని దిగ్విజయంగా స్వదేశానికి తిరిగి వస్తోంది టీమిండియా.

ADVERTISEMENT
Latest Stories