Union Budget 2025 No to Andhrapradesh

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిలువ చేసుకునేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో పోలవరానికి నిధులు బాగా తక్కువ కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం రూ.5,396 కోట్లు మాత్రమే కేటాయించారు.

Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?

అయితే దీంతో కలిపి రూ.17,396 కోట్లు చెల్లించేస్తోంది కనుక ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లలో మిగిలిన రూ.13,040 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది.

పోలవరం నిర్మాణానికి ఎలాగూ రూ.30,436.95 కోట్లు చెల్లించేందుకు బడ్జెట్‌లో ఆమోదం తెలిపినందున అవసరమైతే మిగిలిన సొమ్ముని కూడా వీలు వెంబడి విడుదల చేయడానికి ఆర్ధికశాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిలువ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో వాటి అభ్యంతరాలకు కేంద్రమే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. కనుక ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది తప్పినట్లే.

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటుకి 100 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందిస్తున్నప్పుడే కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ వ్రాశారు. ఇద్దరు కేంద్రమంత్రుల ద్వారా కూడా చెప్పించారు. కానీ నేడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ మెట్రో ప్రస్తావనే లేదు.

Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?

బడ్జెట్‌లో పెట్టకపోయినా కొన్ని ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆమోదించి నిధులు కేటాయిస్తుంటుంది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ఈసారి తప్పనిసరిగా మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉన్నారు. కనుక సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అందిన తర్వాత నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.

అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంక్, హడ్కో నుంచి రూ. 15,000 కోట్లు అప్పు ఇప్పించింది కనుక ఈసారి బడ్జెట్‌లో వేరేగా నిధులు కేటాయించిన్నట్లు లేదు. కానీ అప్పుడే ఇలా అనుకోవడం తొందరపాటే అవుతుంది.

అమరావతి నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇద్దరూ హామీ ఇచ్చారు. కనుకనే రాబోయే మూడేళ్ళలో అమరావతికి రూపురేఖలు తెస్తామని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఇద్దరూ గట్టిగా చెప్పారని భావించవచ్చు. కనుక తర్వాత అవసరమైనప్పుడు అమరావతికి కూడా కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.




ఒకవేళ కేటాయించకపోయినా అమరావతికి రైల్, రోడ్ కనెక్టివిటీ కోసం పలు ప్రాజెక్టులకు రైల్వేశాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇదివరకే ఆమోదం తెలిపాయి. వేలకోట్లతో చేపట్టబోతున్న ఆ పనులకు ప్రధాని మోడీ ఇటీవల విశాఖ వచ్చినప్పుడు శంకుస్థాపనలు కూడా చేశారు. కనుక అమరావతికి నిధులు కేటాయించలేదని అనుకోవడం సరికాదనే చెప్పాలి. కనుక బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిపోయిందని అనుకోలేము.