
దేశంలో కావచ్చు.. రాష్ట్రాలలో కావచ్చు.. నేటికీ పర్యాటక రంగం అంటే అందరికీ చిన్నచూపే. దాని విలువ తెలిసిన గోవా, కేరళ, ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు పర్యాటక రంగం నుంచి భారీగా ఆదాయం పొందుతున్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి ‘పరిశ్రమ హోదా’ కల్పించి పలు రాయితీలతో ప్రోత్సాహిస్తుండటంతో అప్పుడే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. తొలిసారిగా పర్యాటక రంగంలో రూ.1,217 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
విశాఖపట్నంలో తొలిసారిగా సోమవారం పర్యాటక ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో వివిద సంస్థల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రంగంలో ఉన్న 8 సంస్థలు రాష్ట్రంలో తిరుపతి, అమరావతి, గుంటూరు, బాపట్ల, చీరాల, అల్లూరి సీతారామరాజు, విశాఖ, భోగాపురం వద్ద స్టార్ హోటల్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
వాటిలో డాల్ఫిన్ ఓషన్ క్రూయిజ్ రూ.5 కోట్లు పెట్టుబడితో విశాఖలో హోటల్ నిర్మించబోతుండగా, అట్మాస్పియర్ కోర్ అనే సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడితో తిరుపతి, అమరావతి, విశాఖలో స్టార్ హోటల్స్ నిర్మించబోతోంది.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
ఐటి, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఇంతకు 10 వేల రెట్లు పెట్టుబడులు వస్తుండవచ్చు. కానీ ఇంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగంపై ప్రభుత్వం కాస్త చొరవ జూపితేనే తొలి సదస్సులోనే రూ.1,217 కోట్లు పెట్టుబడులు రావడం మామూలు విషయం కానే కాదు. కనుక మరికాస్త గట్టిగా కృషి చేస్తే ఈ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇవి సూచిస్తున్నాయి.
రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలను అభివృధ్ది చేసి, రవాణా, మౌలిక వసతులు కల్పించగలిగితే రాష్ట్రానికి పర్యాటకులు పెరుగుతారు. వారి ద్వారా మారుమూల పర్యాటక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు కూడా జీవనోపాది, ఆదాయం లభిస్తుంది. ఈ నెల 31 నుంచి అరకులో ‘చలి ఉత్సవ్’ పేరుతో వేడుకలు జరుగబోతున్నాయి.