చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ముంబై ఇండియన్స్ – రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ వీక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచడంలో సక్సెస్ సాధించింది. మ్యాచ్ లో ఒక్క బాల్ మిగిలి ఉందనగా, పూణే జట్టు విజయం సాధించగా, ఒత్తిడిలో క్యాచ్ లను వదిలి మ్యాచ్ ను ముంబై జట్టు చేజేతులా పూణేకు అప్పగించింది. అయితేనేం… మైదానంలో ఉన్న ప్రేక్షకులకు గానీ, టీవీల ముందు కూర్చున్న వీక్షకులకు గానీ మాంచి ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చింది ఈ మ్యాచ్.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 184 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసింది. చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్య (35 పరుగులు) 4 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో ఈ మాత్రం స్కోర్ కు చేరుకోగలిగింది. ఓపెనర్ బట్లర్ 38, రానా 34, పొల్లార్డ్ 27 పరుగులతో రాణించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకు ఔటై నిరాశపరిచాడు. బ్యాటింగ్ ఆరంభంలో ముంబై దూకుడు చూస్తే 200 పరుగులు అవలీలగా దాటుతుందని భావించగా, ఇమ్రాన్ తాహీర్ వెంటవెంటనే 3 వికెట్లు తీసి స్కోర్ బోర్డుకు అడ్డుకట్ట వేసాడు.
ఇక లక్ష్యచేదనలో పూణే జట్టు ఓపెనర్ రెహనే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లోనే 60 పరుగులు చేసి, టీంను పటిష్ట స్థితిలో ఉంచాడు. రెహనే క్రీజులో ఉన్నంతసేపు పూణే అవలీలగా గెలిచేస్తుందని భావించడం వీక్షకుల వంతయ్యింది. మరో ఓపెనర్ అగర్వాల్ 6 పరుగులకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, పూణే జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. నిజానికి స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను రానా అందుకుని ఉంటే, మ్యాచ్ ఫలితం మరోలా ఉండేలా అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చు.
ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పాటు, 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు స్మిత్. ముఖ్యంగా పొల్లార్డ్ వేసిన చివరి ఓవర్ లో విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా, తొలి మూడు బంతుల్లో కేవలం 3 పరుగులే రావడంతో, ఒత్తిడిలో ఉన్న జట్టుకు వరుసగా 2 సిక్సర్లు కొట్టి ఘనవిజయాన్ని అందించాడు. మరో ఎండ్ లో ధోని ఉన్నప్పటికీ, భారీ షాట్లను కొట్టడంలో విఫలమయ్యాడు. ఒక రకంగా ధోని ఆడిన డాట్ బాల్స్ వలనే మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లిందని చెప్పవచ్చు.



