శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ మొత్తం పాయింట్ల పట్టికను తారుమారు చేయనుందా? అది ఇప్పుడే చెప్పలేం గానీ, దాదాపుగా ప్రతి జట్టుకు ఓకే అవకాశాన్ని అయితే కల్పించిందని చెప్పవచ్చు. చెన్నైపై రాజస్తాన్ సాధించిన సంచలన విజయం, మొత్తం పాయింట్ల పట్టిక అంతా ప్రభావితం కానుంది. ఈ విజయంతో 11 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో ముంబై, కోల్ కతా జట్ల సరసన నిలిచింది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బట్లర్ ఒంటి చేత్తో రాజస్తాన్ కు విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 176 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో ఆది నుండి వికెట్లు కోల్పోతూ వస్తున్నప్పటికీ, మరో ఎండ్ లో బట్లర్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడంతో రాజస్తాన్ కు విజయం వరించింది. 60 బంతుల్లో 95 పరుగులు చేసిన బట్లర్ చివరి ఓవర్ లో విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా, 5 బంతుల్లోనే వాటిని సాధించి రాజస్తాన్ కు కీలకమైన విజయాన్ని అందించాడు.



