ఉత్కంఠభరితంగా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్!

ipl9వ సీజన్ ఐపీఎల్ హంగామా దాదాపుగా సగం పూర్తయ్యింది. 8 జట్లు పాల్గొంటున్న ఈ సీజన్లో 4 జట్లు మాత్రమే ‘ప్లే ఆఫ్స్’కు క్వాలిఫై అవుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ను పరిశీలిస్తే… ఆ నాలుగు స్థానాలకు గానూ 5 జట్లు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. ధోని సారధ్యం వహిస్తున్న పూణే జట్టు, కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు టీం, మురళీ విజయ్ పగ్గాలు అందుకున్న పంజాబ్ దాదాపుగా ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనపడుతున్నాయి. ఈ మూడు జట్లు పుంజుకోవాలంటే ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక, ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే జట్ల జాబితాలో గుజరాత్ అన్నింటి కంటే ముందుగా 9 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్ లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే గుజరాత్ గట్టేక్కినట్టే. ఈ సీజన్లో అందర్నీ అవాక్కు చేసింది ఢిల్లీ టీం. గత ఐపీఎల్ సీజన్లలో అంతగా ప్రభావం చూపలేని ఢిల్లీ జట్టు, ఈ సారి మాత్రం ఆడిన 7 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి మంచి ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీ ఇంకా 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా క్వాలిఫై కావడానికి 3 విజయాలు సరిపోతాయి గనుక ఢిల్లీ కూడా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు చేరినట్టే భావించవచ్చు.

ADVERTISEMENT

ఇక, మిగిలిన రెండు స్థానాల కోసం కోల్ కోతా, ముంబై, హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లు కూడా పోటాపోటీగా ఫాంలోకి రావడంతో చివరి నిముషం వరకు ఏ జట్టు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. నిలకడైన ఆట తీరుతో కోల్ కోతా సత్తా చాటుతుండగా, హ్యట్రిక్ విజయాలతో ముంబై మంచి ఊపు మీద ఉంది. ఇక హైదరాబాద్ జట్టు కూడా ఈ సీజన్లో అంచనాలను మించి రాణిస్తుండడంతో ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్వాలిఫైలో ‘నెట్ రన్ రేట్’ కూడా కీలక పాత్ర పోషిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సగం పూర్తయ్యే సమయానికి ఐపీఎల్ రసకందాయంలో పడింది.

ADVERTISEMENT
Latest Stories