ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ అనే పేరు వినగానే అందరికి మొదటిగా గుర్తుకువచ్చేది ఆ లీగ్ సృష్టించే బిజినెస్. ప్రపంచంలో మరే క్రికెట్ లీగ్ కూడా చెయ్యనంత బిజినెస్ చేస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్రికా వంటి క్రికెట్ ఆదరణ ఎక్కువగా ఉన్న దేశాలలో కూడా లేని విధంగా ఐపీఎల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుందంటే అతిశయోక్తి లేదు.
భారత స్టార్ ఆటగాళ్లందరూ ఫారెన్ స్టార్స్ తో జతకట్టి ఒకే జట్టుకు ఆడనుండటంతో అభిమానులకు ఈ లీగ్ మొదలవనుంది అంటే క్రికెట్ జాతర రానుంది అన్నట్లుంటుంది. కానీ, ఐపీఎల్ కేవలం భారత స్టార్స్ కు మాత్రమే కాదు, ఇంకా ముఖ్యంగా నేటి తరం యువకులకు ఈ లీగ్ ఒక అద్భుతమైన వేదిక వంటిది.
గతంలో రంజీలు, విజయ్ హజారే, ముష్తాక్ అలీ, దులీప్,ఇరానీ వంటి ఎన్నో లీగ్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన అతి కొంత మంది ఆటగాళ్లకు మాత్రమే భారత జట్టులో చోటు దొరికేది. కానీ ఈ ఐపీఎల్ తెరలోకి వచ్చినతరువాత యువ క్రికెటర్ల పంట పండినట్టే చెప్పవచ్చు.
డొమెస్టిక్ లీగ్లను, ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా దగ్గరగా గమనిస్తూ, బీసీసీఐ చేయవలసిన సగం పనులు ఈ ఫ్రాంచైజీలే చేసేస్తున్నాయి. ఇక, అన్ని ఫ్రాంచైజీలలో యువ భారత టాలెంట్ ను కనుగొనడంలో ముంబై ఎప్పుడు ముందే ఉంటుంది. కానీ, ప్రస్తుతం రాజస్థాన్ ఫ్రాంచైజ్ కూడా ముంబై కు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించుకుంటుంది.
ఇటీవలే వైభవ్ సూర్యవంశీ వంటి ఒక అద్భుతమైన ట్యాలెంట్ ను ప్రపంచ క్రికెట్ కి పరిచయం చేసింది. అంతకు ముందు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ వంటి విశేషమైన భారతీయ నైపుణ్యాన్ని గుర్తించి ఆ ట్యాలెంట్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది కూడా రాజస్థాన్ జట్టు యాజమాన్యం.
రియాన్ పరాగ్ ను ఎప్పుడో 2020లలో కొనుగోలు చేసిన రాజస్థాన్ జట్టు, అతడు వరుసగా 2-3 సీజన్లు విఫలమయినప్పటికీ అతనిపై నమ్మకం ఉంచి మెగా ఆక్షన్ లో కూడా అతడిని రీటెయిన్ చేసుకున్న ఆ జట్టుకు ఇప్పుడు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వరుసగా 3 మ్యాచ్లలో 3 విజయాలను అందించి పెట్టాడు.
ఇక, గతేడాది జరిగిన ఆక్షన్లో 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ ను కొనుగోలు చేసి షాక్ ఇచ్చిన రాజస్థాన్ కు, తొలి 2 మ్యాచ్లలో వైభవ్ విఫలమైనప్పుడు అభిమానులు రాజస్థాన్ ఫ్రాంచైజ్ ను ట్రోల్ చేసినప్పటికీ అతని ఆటపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన రాజస్థాన్, కేవలం తమ ఫ్రాంచైజీకే కాదు జాతీయ జట్టుకు ఒక ఫియర్లెస్ బ్యాటర్ ను పరిచయం చేసింది.
ఇక, ఇలా చెప్తూ వెళితే రాజస్థాన్ కు ట్రోఫీ ల పరంగా కొరవ ఉండవచ్చు గాని, భారత నైపుణ్యం పరంగా కొరతే లేదు. గత 2-3 ఏళ్లగా మంచి ప్రదర్శన ఇస్తున్న రాజస్థాన్ జట్టు ఈసారి ఇప్పటికి ఓటమి చవిచూడకుండా 3 మ్యాచ్లు గెలిచి నేడు ఆర్.సి.బీ తో తలపడుతున్నారు. మరి రాజస్థాన్ తమ జైత్రయాత్ర ను ఇలానే కొనసాగించగలరా..?






