టైప్ క్యాస్టింగ్ అనేది ఇండస్ట్రీలో నటుల్ని ఏ స్థాయిలో ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలామందికి తెలుసు. అందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తన కెరీర్ లో కేవలం ఒక సినిమాలో మాదా వేషం వేసినందుకు నటులు వెంకటేశ్వర్రావును ఆ పాత్రకు పరిమితం చేసేసింది ఇండస్ట్రీ, అందుకే ఆయన మాడా వెంకటేశ్వర్రావుగానే ప్రసిద్ధి చెందారు. ఏకంగా మాడా సంఘం ఆయన్ను తమ సంఘానికి పెద్దగా ఉండాలని కోరారంటే.. దాని ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు.
తర్వాత కూడా ఇండస్ట్రీ కమెడియన్ల విషయంలో అదే ఫార్మాట్ ను ఫాలో అవుతూ వచ్చింది. “బాబాయ్ హోటల్”లో బ్రహ్మానందం సెంటిమెంటల్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా ఆయన్ను “రంగమార్తాండ” వరకు ఏ ఒక్క సినిమాలోనూ ఒక హుందా పాత్ర ఇవ్వలేదు మన దర్శకులు. “అంకుల్” అనే సినిమాతో ఎలాంటి సీరియస్ పాత్రలైనా చేస్తాను అని ప్రూవ్ చేసుకున్నా కూడా ఏవీఎస్ కి మంచి పాత్ర ఇవ్వలేదు. “బుజ్జిగాడు”లో ప్రభాస్ ను పట్టుకుని మనస్పూర్తిగా ఏడ్చే సన్నివేశంలో ఎమ్మెస్ నారాయణ నటన చూసాక కూడా ఆయనకి మంచి రోల్స్ రాలేదు.
“పుష్ప” వరకు సునీల్ పరిస్థితి అదే. ఆ సినిమాతో సునీల్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. రీసెంట్ గా “ఇరుముడి”లో కొమరం అనే పాత్రధారి కూడా అదే కోవలోకి వస్తాడు. 18 ఏళ్లుగా ఎండస్ట్రీలో ఉన్నా లేడీ క్యారెక్టర్స్ తప్ప ఏమీ రాలేదు. కనీసం అతడి కుటుంబం కూడా అతడి విషయంలో సంతోషంగా లేరు. కట్ చేస్తే.. ఇరుముడిలో నాగులు అనే పాత్రతో అతడి జాతకం మారిపోయింది.
ఇలా నటీనటుల్ని ఒకే రకమైన క్యారెక్టర్స్ కి పరిమితం చేసేయడం వల్ల వాళ్ల నట సామర్థ్యం అనేది జనాల్లోకి వెళ్లడం లేదు. ఇదిగో ఇలా అప్పుడప్పుడు ఎవరైనా దర్శకులు కాస్త రిస్క్ చేసి, కొత్తగా చూపిద్దామని ప్రయత్నిస్తే కానీ.. ఎందరో మంచి ఆర్టిస్టులు ఈ టైప్ క్యాస్టింగ్ కోరల్లో చిక్కుకుని బాధపడుతున్నారు.
ఇప్పటికైనా.. ఏదైనా ముఖ్యమైన పాత్రకి, నెగిటివ్ షెడ్ కి మన దర్శకులు పరభాషా నటుల మీద ఆధారపడకుండా ఇలా లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కామెడీ నటుల్ని కేవలం కామెడీకి మాత్రమే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ రోల్స్ ఇస్తే వాళ్ల సత్తాను వాళ్లు ఘనంగా చాటుకోవడమే కాక, సినిమాకి-కథకి-ప్రేక్షకులకి ఒక కొత్త డైమెన్షన్ ను తీసుకొస్తారు.





