ఆంద్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా తెలంగాణలో లబ్ది పొందవచ్చనే దురాశతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది. అందుకు ఫలితం అనుభవించింది. ఏపీలో జగన్ వైసీపీని బలోపేతం చేసుకొని ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
కనుక వైఎస్ షర్మిల అయితే అన్న జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొని, ఆ పార్టీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించగలరని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది.
కానీ కనీసం ఆమె కనీసం కార్యకర్తలని కూడా పార్టీలోకి రప్పించలేకపోయారు. ఈ పరిస్థితిలో ఆమె అప్పుడప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వాన్ని, జగన్‌ని విమర్శిస్తూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, కేరళలో సొంతంగా అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కాగలిగింది. కనుక ఆంధ్రాని కూడా చేజిక్కించుకోగలిగితే దక్షిణాదిన కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది.
కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం నానాటికీ బలపడుతూ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి వేస్తున్న తప్పటడుగుల వలన వైసీపీ బలహీనంగా మారుతోంది.
కనుక రాజకీయ ఒంటరితనంతో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఏదోవిధంగా మళ్ళీ కాంగ్రెస్ గూటికి తెచ్చుకొని ఆయనకు సాయపడితే అటు ఆయనకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు కలుగుతుంది.
ఏపీలో మళ్ళీ అధికారంలోకి రాగలిగితే జాతీయ స్థాయిలో బిజేపిని ఢీకొట్టగలదు. మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదు.
అయితే ముందుగా జగన్‌కి పక్కలో బల్లెంలా ఉన్న వైఎస్ షర్మిలని ఏపీ నుంచి బయటకు పంపించాల్సి ఉంటుంది. ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని ముందే కాంగ్రెస్ అధిష్టానం ప్రామిస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇటీవల వచ్చాయి.
జగన్‌తో సన్నిహిత సంబంధాలున్న డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక సిఎం పదవి చేపడుతున్నారు. కనుక అయన ద్వారా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు.
కాంగ్రెస్ అధిష్టానం ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోందా లేదా? అనే విషయం వైఎస్ షర్మిలని రాజ్యసభకి బదిలీ చేసినట్లయితే నిర్ధారణ అవుతుంది.
కానీ అక్రమాస్తుల కేసులలో చిక్కుకున్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం మాటలు నమ్మి కాంగ్రెస్ గూటికి చేరేందుకు అంగీకరిస్తారా లేక గాయపడ్డ సింహంలా కళ్ళు మూసుకొని మూడేళ్ళు తాడేపల్లి ప్యాలస్‌లో ఎదురుచూస్తారా? అనేది కూడా అప్పుడే తెలుస్తుంది.




