Is KTR Wishing By-elections?

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అందుకు కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ సిఎం రేవంత్ రెడ్డిని నిందిస్తున్నారు.

ఒకవేళ కేసీఆర్‌ తమ ప్రభుత్వం జోలికి రాకుండా ఉంటే, మేము కూడా మీ జోలికి రామని సిఎం రేవంత్ రెడ్డి ఆనాడే చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోగా కూలిపోతుందంటూ బెదిరించారు. అందువల్లే కాంగ్రెస్‌ కూడా పావులు కదిపి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించుకొని తమ ప్రభుత్వం పడిపోకుండా బలోపేతం చేసుకుంది. కనుక ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టలేము.

Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే

బిఆర్ఎస్ చాలా బలహీనంగా ఉన్నపుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టలేదు. ఎందువల్ల అంటే, ఒకవేళ వారి రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు బిఆర్ఎస్ నేతలు సిద్దంగా లేరు కనుక.

ఒకవేళ ఉన్నా కాంగ్రెస్ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంది. కనుక అది మరింత శక్తివంతంగా మారింది. బీజేపి నుంచి గట్టి పోటీయే ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఉప ఎన్నికలలో వాటిని ఎదుర్కొని గెలవలేమనే భయంతోనే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ పట్టుబట్టడం మానేసింది.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసిందంటే, ఉప ఎన్నికలు జరిగితే తప్పకుండా గెలుస్తామని ధీమా ఏర్పడిందని కాదు.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకపోవడంతో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే సవాళ్ళు విసురుతున్నారు. పైగా కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ముగ్గురు మద్య ఆధిపత్యపోరు సాగుతోందని కాంగ్రెస్‌ మంత్రులు వాదిస్తున్నారు.

Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!

వారి వాదనలు బిఆర్ఎస్ పార్టీలో నాయకత్వం సమస్య ఉందనే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసుని మళ్ళీ ముందుకు జరిపి, “ఉప ఎన్నికలొస్తున్నాయి అందరూ సిద్దంగా ఉండండి..” అంటూ కేటీఆర్‌ ప్రజల దృష్టిని తమ పార్టీ నాయకత్వ సమస్యపై నుంచి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయంలో సుప్రీంకోర్టు వివరణ అడిగింది కనుక తెలంగాణ శాసనసభ కార్యదర్శి ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. రేపు సుప్రీంకోర్టుకి అదే చెప్పుకొని మరింత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.

ఇలా కొంత కాలం సాగదీసిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని భావిస్తే ముందుగా ఇద్దరో ముగ్గురి చేతో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలలో ఆ స్థానాలు గెలుచుకున్న తర్వాత మరో ఇద్దరో ముగ్గురి చొప్పున వరుసగా రాజీనామాలు చేయిస్తుంది. ఈవిదంగా విడతల వారీగా ఉప ఎన్నికలు జరిగితే సాధారణంగా అధికార పార్టీయే గెలుస్తుంది తప్ప బలహీనంగా ఉన్న బిఆర్ఎస్ కానే కాదు… అని కేటీఆర్‌కి బాగా తెలుసు.

కానీ త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయని అందరూ సిద్దంగా ఉండాలని కేటీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎందువల్ల అంటే, సాధారణంగా న్యాయస్థానాలు శాసనసభ, లోక్‌సభలో జరిగే వ్యవహారాలలో, వాటి స్పీకర్‌ పరిధిలో అంశాలలో జోక్యం చేసుకోవని, అందుకే హైకోర్టు కలుగజేసుకోలేదని రేపు సుప్రీంకోర్టు కూడా అదే చేయవచ్చని కేటీఆర్‌కు తెలుసు గనుకనే.




ఒకవేళ ఉప ఎన్నికలొస్తే మొదట నష్టపోయేది తామేనని, కానీ రావని కూడా కేటీఆర్‌కు బాగా తెలుసు. అందుకే ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎన్నికలు రావాలని, వాటిలో తాము గెలుస్తామని మాత్రం కానే కాదు.