సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రెండు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో ప్రజలతో ముఖాముఖీ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, సాగునీరు, పేదలకు ఇళ్ళు తదితర అంశాల గురించి ఆమె మాట్లాడుతున్నారు.
ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆమె జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు, తొలిసారిగా ప్రజల మద్యకు వచ్చి న్యాయం కోసం పోరాడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల సమయంలో భర్త తరపున కుప్పంలో ప్రచారం చేశారు.
అప్పుడే ఆమె “ఈసారి కుప్పం నుంచి నన్ను పోటీ చెయ్యమంటారా?” అని ప్రజలను సరదాగా ప్రశ్నించారు. అప్పుడు ఆమె సరదాగా అడిగినా వచ్చే ఎన్నికలలో ఆమె కుప్పం నుంచి పోటీ చేయబోతున్నారా?అందుకే ఇప్పటి నుంచి మెల్లగా ఈవిదంగా సన్నాహాలు మొదలుపెట్టారా?అనే సందేహం కలుగుతోంది.
ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నట్లయితే ఆమె కంటే వయసులో చిన్నవారైనా నారా బ్రాహ్మణి రాజకీయాలలో ప్రవేశించవచ్చు కదా?కానీ భువనేశ్వరి రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా? అనే సందేహం కలుగుతుంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అంతా అనుకూల వాతావరణమే ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇలాగే ఉంటుందని అనుకోలేము. అప్పటికి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, సమీకరణాలు, బలాబలాలు ఏవిదంగా మారుతాయో ఇప్పుడే ఊహించలేము.
కనుక ఒకవేళ నారా భువనేశ్వరి రాజకీయాలలో ప్రవేశించి, కుప్పం నుంచి పోటీ చేయాలనుకుంటే, దాని వలన టీడీపీకి మేలే జరుగుతుంది. కనుక ఆమెకు అటువంటి ఆలోచన ఉంటే తప్పక స్వాగతించవచ్చు.




