సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన గడువు తేదీ లోపున హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనంను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను ప్రధానికి వివరిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.
వ్యక్తులు తమ ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలుపగా, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వివరాలు ఎలా బయటకి చెబుతున్నారని జగన్ ప్రశ్నించారు. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రెండు సందర్భాల్లో ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారని జగన్ పేర్కొన్నారు. ఓ వ్యక్తి 10 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారన్న సమాచారం చంద్రబాబుకు ఎలా చేరిందని ప్రశ్నించారు.
అయితే కాసేపటికి తేరుకున్న తర్వాత…. అయినా 10 వేల కోట్ల నల్లధనం కలిగి ఉన్న వ్యక్తికి చంద్రబాబు బినామీ అయి ఉండవచ్చని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎందుకంటే, అంత కచ్చితంగా 10 వేల కోట్ల రూపాయలని చంద్రబాబే చెబుతున్నారని, ఎన్‌సీఏఈఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడి పాలనలో ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షన్నర కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో తెలుపుతూ ఓ పుస్తకం ప్రచురించినట్లు లేఖలో జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబుపై విచారణకు ఆదేశించడానికి తగినంత సమాచారం ఆ పుస్తకంలో ఉందని, కానీ ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదని అన్నారు. తనపై విచారణ జరిపించే వ్యక్తి దేశంలోనే లేరని చంద్రబాబుకు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఐడీఎస్‌లో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు బహిర్గతం చేయాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిపై స్పందించి, ఆయనపై విచారణ చేయించాలని జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు.



