ఏపీ సిఎం జగన్ నిన్న ఎమ్మిగనూరు సభలో మాట్లాడుతూ, “రానున్నది కురుక్షేత్ర యుద్ధం. దానిలో పాండవులకి, కౌరవులకి మద్య యుద్ధం జరుగబోతోంది. పేదలు-పెత్తందారులకి మద్య ‘క్లాస్ వార్’ జరుగబోతోంది. తోడేళ్ళ గుంపులన్నీ ఏకం అయ్యి మీ ఈ బిడ్డపై దాడి చేయబోతున్నాయి. ఆ గజదొంగల ముఠా చెప్పే మాటలు నమ్మవద్దు. మీకు మేలు జరిగిందా లేదా?అని మాత్రమే ఆలోచించి మీ ఈ బిడ్డకు ఓట్లు వేయండి,” అంటూ తన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి జగన్ చెప్పుకొన్నారు.
మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి వనవాసం, అజ్ఞాతవాసం చేసిన పాండవులు, శ్రీకృష్ణుడు సాయంతో కౌరవులపై యుద్ధం చేసి గెలిచారని అందరికీ తెలుసు. అయితే 2019లో ‘కౌరవుల బ్యాచ్’ ఆడిన ఎన్నికలనే మాయాజూదంలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు అప్పటి నుంచి అష్టకష్టాలు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆనాడు పాండవులు వనవసానికి, చివరికి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా ధూర్యోధనుడు వారిని విడిచిపెట్టకుండా వేధించిన్నట్లే, గత నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలను వైసీపి ప్రభుత్వం వేధిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆనాడు దుర్యోధనుడు ధైర్యంగా పాండవులను కురుక్షేత్ర సంగ్రామంలో ఎదుర్కొన్నాడు. కానీ వైసీపి ప్రభుత్వం యుద్ధం మొదలవక ముందే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని జైల్లో వేసి, మిగిలినవారిని కూడా జైల్లో వేసేసేందుకు ప్రయత్నిస్తూ ఇప్పుడు మేము యుద్ధానికి సిద్దమని చెప్పుకొంటోంది.
బహుశః అందుకేనేమో టిడిపి, జనసేనలు కౌరవులని చెప్పగలుగుతున్నారు కానీ మేము పాండవులమని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారేమో?
ఆనాడు అర్జునుడు, దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి సాయం అర్ధించారు. ఇప్పుడు జగన్, చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణుడు స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సాయం కోరుతున్నారు.
ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మంవైపు నిలిచాడు. కానీ ఇప్పటి శ్రీకృష్ణుడు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. దానర్ధం అందరికీ తెలుసు. ఆ ‘యోగ నిద్ర’ పర్యవసనాలను టిడిపి అనుభవిస్తూనే ఉంది.
శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉంటే అది కురుక్షేత్రం. కౌరవులవైపు ఉంటే అది కలియుగం. కనుక ఏపీలో పాండవులు ఎవరో కౌరవులు ఎవరో ప్రజలే గ్రహించాలి.






