ఈ నెల 22 నుంచి 26వరకు దావోస్ నగరంలో ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి సిఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం బయలుదేరారు. ఈ సదస్సులోపాల్గొనే వివిద దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులతో వారు సమావేశమయ్యి గత మూడేళ్ళుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి వారికి వివరిస్తారు.
కరోనా ప్రతికూల పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలో కొత్తగా నౌకాశ్రయాలు (పోర్టులు), విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి బృందం దావోస్ సదస్సులో వివరించి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యావరణహిత పరిశ్రమలు స్థాపించవలసిందిగా కోరనున్నారు. దీని కోసం దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ‘పీపుల్-ప్రోగ్రెస్-పాజిబిలిటీస్’ అనే పేరుతో పెవిలియన్ (స్టాల్) ఏర్పాటు చేస్తున్నారు.
అయితే గత మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పధకాల డప్పు తప్ప పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి అనే పదాలే వినబడనే లేదని అందరికీ తెలుసు. పైగా విద్యుత్ కోతలు, పవర్ హాలీడేస్‌తో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే నడవలేని పరిస్థితిలో నష్టాలలో కూరుకుపోతున్నాయి.
అమర్ రాజా బ్యాటరీస్, సంగం డైరీ వంటి కర్మాగారాలు వైసీపీ రాజకీయ కక్ష సాధింపులతో సతమతమవుతున్నాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరే ముందు రోజే…అంటే నిన్ననే “అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని” సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడమే ఇందుకు తాజా నిదర్శనం.
ఇక విశాఖలో ఉండే కొన్ని ఐటి కంపెనీలు కూడా ఒకటొకటిగా హైదరాబాద్ తరలిపోతూనే ఉన్నాయి. జగనన్న పేరు చెపితే ఏపీ సినీ పరిశ్రమ హడలిపోతోంది. ఆయనే స్వయంగా ఏపీకి తరలిరావాలని ఆహ్వానించినా ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ స్పందించలేదు.
చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో ఆయనపై నమ్మకంతో రాజధానిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిద సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిపివేసి, కొత్తగా మూడు రాజధానులంటూ పాట మొదలుపెట్టడంతో ఆ సంస్థలూ వెనక్కు వెళ్ళిపోయాయి.
ఇక సంక్షేమ పధకాల కోసం ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని దావోస్ సదస్సులో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు తెలియవని అనుకోలేము. తెలిసి వారు పెట్టుబడులు పెడతారని ఆశిస్తే అది అత్యశే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కలుషిత రాజకీయ వాతావరణం నెలకొని ఉంది కనుకనే దేశ, విదేశాలకు చెందిన సంస్థలు పక్కనే ఉన్న హైదరాబాద్‌కు తరలిపోతున్నాయి.
ఈ సదస్సులో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆయన తమ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి గురించి చెప్పుకోనక్కర లేదు. కేవలం తమ రాష్ట్రానికి, రాజధాని హైదరాబాద్ నగరానికి తరలివచ్చిన, ఇంకా వస్తున్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాటి పెట్టుబడుల జాబితా చదివితే చాలు…ఇక ఏ కంపెనీలు ఏపీకి రావాలనే ఆలోచన కూడా చేయవు. కనుక దావోస్ సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి బృందం రాష్ట్రం గురించి గొప్పగా ఏమి చెప్పుకొంటుందో, ఏమి సాధిస్తుందో చూడాలి.



