తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని లేదా దానంతట అదే కూలిపోతుందంటూ బిఆర్ఎస్ నేతలు మొదటి నెల నుంచే పాట మొదలుపెట్టేయడం అందరూ వినే ఉంటారు. ఏపీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిదంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కనుక రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే టిడిపి కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారన్న మాట!
తెలంగాణలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకొని దాని సాయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కలలు కంటున్నారు. జగన్ ఆలోచన కూడా సరిగ్గా అలాగే ఉంది.
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 10 మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ పదేపదే చెప్పారు. ఒకవేళ జగన్ వద్ద కూడా 10-15 మంది ఎంపీలు ఉండి ఉంటే ఆయన కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారే కదా?
అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ ప్రతిపక్షాలతో ఓ ఆట ఆడుకున్నారు. కానీ అధికారం కోల్పోయి, ఇద్దరి వద్ద సరిపడా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలతో ఓ ఆట ఆడుకుంటున్నారు. అది వారి తెలివితేటలనుకోవాలా లేక ఇవతలవారి మెతకతనం అనుకోవాలా?
జగన్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయాలలో కొన్ని అవాంఛనీయమైన విధానాలను ప్రవేశపెట్టి రాజకీయాలను కలుషితం చేసి వాటికే వారే బలైపోయారు. అయినా వారి తీరు మారలేదు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందంటూ వారే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేయాలనుకోవడం, శాంతి భద్రతల పేరుతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరుకోవడమే ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను తక్కువ అంచనా వేయడం వలన నష్టపోయామని గ్రహించిన జగన్, కేసీఆర్‌లకు మరోసారి అవకాశం లభిస్తే వారిరువురినీ మళ్ళీ రాజకీయాలలో అడుగుపెట్టనీయకుండా చేయడం ఖాయం.
కనుక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల అరాచకాలను అణచివేసి మళ్ళీ లేవకుండా చేసిన్నట్లు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలను అదే విదంగా ‘డీల్ చేయాలని,’ ప్రస్తుతం రాజకీయాలలో ఇదే ట్రెండ్ నడుస్తోంది కనుక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫాలో అయితే మంచిదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ దిశలో పని మొదలుపెట్టేశారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెలన్నర మాత్రమే అయినందున వైసీపి… దాని అధినేత జగన్‌పై ఇంకా దృష్టి సారించలేదు.
కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు కనుక ఆయన దూకుడుకి అడ్డుకట్ట వేయకతప్పదనిపిస్తోంది.




