జగన్ భావోద్వేగం నిజమా? లేక అవసరమా?

Jagan Emotional Tribute to YSR

నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ, జగన్‌ దంపతులు, వారి బంధుమిత్రులు, పలువురు వైసీపీ నేతలు ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆత్మసాక్షిగా జగన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘మిస్ యూ డాడ్’ అంటూ ఆ భావోద్వేగాలు, ఫోటోలు అభిమానులతో కూడా షేర్ చేసుకున్నారు.

ADVERTISEMENT

తల్లి తండ్రులు బిడ్డలని ప్రేమించినంతగా పిల్లలు వారిని ప్రేమిస్తున్నారా?అంటే అవునని చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి నేడు. ఇందుకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డినే చెప్పుకోవాలి.

తండ్రి పావురాలగుట్టలో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోయిన తర్వాత నుంచి ఆయన అంత్యక్రియలు జరిగేలోగా జగన్‌ ఏవిదంగా పావులు కదిపారో అందరికీ తెలుసు. తండ్రి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని ఓదార్పు యాత్రలతో వైసీపీకి బలమైన పునాది వేసుకున్నారు.

నేటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్న జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చే వరకు తన ప్రసంగాలలో ప్రతీ వాక్యం ముందోసారి వెనకోసారి “మన ప్రియతమ దివంగత నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి,” అంటూ ఏ మాత్రం తడబడకుండా తండ్రిపేరు భజించేవారు.

తండ్రి పేరుతోనే పార్టీని పెట్టుకొని, నిర్మించుకొని, అధికారంలోకి వచ్చిన జగన్‌, ఆ తర్వాత మెల్లగా తండ్రి భజన తగ్గించి తన సొంత ఇమేజ్ పెంచుకున్నారు.

రాజకీయాలలో ఇవన్నీ మామూలే కనుక తండ్రి పేరు చెప్పుకొని జగన్‌ రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకోవడాన్ని తప్పు పట్టలేము.

కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి, చెల్లితో వ్యవహరించిన తీరుని ఎవరైనా హర్షించగలరా? ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా ఆస్తుల కోసం జగన్‌ వారిని కోర్టుకీడ్చారు. వారిపై తన పార్టీ నేతలతో, సొంత మీడియాతో బురద జల్లించారు. జగన్‌ స్వయంగా చెల్లి కట్టుకున్న చీర గురించి తప్పుగా మాట్లాడారు.

బ్రతికున్న తల్లి, చెల్లితో ఈవిదంగా వ్యవహరిస్తూ చనిపోయిన తండ్రి కోసం జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కదా?

ఏది ఏమైనప్పటికీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా జగన్‌ రాజకీయంగా బలపడి అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో తోడ్పడ్డారనేది వాస్తవం.

అధికారంలో వచ్చిన తర్వాత తల్లి తండ్రులు, చెల్లి అవసరం తీరిందనుకున్నారు జగన్‌. కానీ కాదని గ్రహించారు. అందుకే తల్లిపై కోర్టులో దావా వేసిన తర్వాత కూడా ఆమెతో సఖ్యతగా ఉంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో మళ్ళీ ప్రతీరోజూ వైఎస్సార్ ఫోటో, స్మృతులు, బంధాలు, అనుబంధాలు కనిపిస్తున్నాయి.

కనుక జగన్‌కి మళ్ళీ ఇప్పుడు తండ్రి ఇమేజ్, ఆశీర్వాదం చాలా అవసరముంది. కనుక ‘మిస్ యూ డాడ్’ అనే మాట మాత్రం జగన్‌ మనసులో నుంచి వచ్చినదే అనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories