ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని పట్టుపడుతున్న వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారా? అంటే కాదనే చెప్పాలి.
సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో వారి ప్రభుత్వం దూసుకుపోతోంది.
కానీ జగన్ మాత్రం ప్రజల మధ్యకు, శాసనసభ సమావేశాలకు రాకుండా తాడేపల్లిలోని ప్యాలస్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
జగన్ తీరుపై మూడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
1. అసెంబ్లీకి, ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు?
2. అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పధకాలు అమలుచేసినా జగన్‌ని ప్రజలు నమ్మలేదు. మరిప్పుడు తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటే ప్రజలు నమ్ముతారా?నమ్మి గెలిపిస్తారా?అసలు ఎందుకు నమ్మాలి?
3. ప్రజల మధ్యకు, శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా ఏ రాజకీయ నాయకుడైన ముఖ్యమంత్రి అయిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయా? లేనప్పుడు తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చున్నా తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని, అధికారంలోకి వస్తానని జగన్ ఎలా అనుకుంటున్నారు? పార్టీ నేతలని, ప్రజల్ని ఎలా నమ్మమంటున్నారు?
నేడు జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్ పెట్టుకుంటే, అక్కడ అనంతపురంలో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు తమ ప్రభుత్వం అమలుచేసిన సూపర్ సిక్స్ పధకాల గురించి ప్రజలకు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరిలో ఎవరి మాట ప్రజలకు వినిపిస్తుంది?ఎవరి మాట వినాలనుకుంటారు?అని ఆలోచిస్తే జగన్ రాజకీయాలతోనే వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.




