శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన జగన్ నేటికీ తన పులివెందుల ప్యాలస్‌లో సేద తీరుతుంటే, కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో సేద తీరుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసింది లేదు. ఎప్పుడూ ప్రజల మద్యనే ఉండేవారు.
అంతే కాదు… నిత్యం ఏదో ఓ కార్యక్రమం రూపొందించి ఇస్తూ పార్టీలో ప్రతీ ఒక్కరూ ప్రజాసమస్యలపై జగన్ ప్రభుత్వంతో పోరాడుతూ ఉండేలా చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఓ పక్క రాజకీయ వేధింపులు భరిస్తూనే అలుపెరుగని పోరాటాలు చేశారు.
టిడిపిని తుడిచిపెట్టేయడానికి జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకున్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చన్నాయుడు తదితర సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గాలలోనే ఓడించి టిడిపి, జనసేన రెండు పార్టీలను ఒకేసారి రాజకీయంగా చావు దెబ్బ తీయాలని జగన్ ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు అంతకంటే చాలా దూరం ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకుని, జగన్ కుట్రలన్నిటినీ భగ్నం చేసి ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
అందుకే ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నేతలు సైతం చంద్రబాబు నాయుడు పోరాట స్పూర్తిని, దూరదృష్టిని, రాజకీయ వ్యూహాలను ప్రశంశిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు… ముఖ్యమంత్రి అయినా అదే పట్టుదల… అదే జోరు…. అదే దూరదృష్టితో పనిచేస్తుంటారు.
జగన్ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినా బటన్ నొక్కుడు సభలకు తప్ప తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చేవారు కారు. వచ్చినా ఎంతసేపు సొంత భజన చేసుకోవడం, సంక్షేమ పధకాల గోల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై ఏడుపులు తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడేవారు కారు.
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం, అమరావతి పర్యటించి వాటి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెలరోజులలోనే టీటీడీ మొదలు జిల్లా స్థాయి వరకు పాలనాపరమైన అనేకానేక నిర్ణయాలు తీసుకొని అమలు చేయిస్తున్నారు.
అప్పుడే విశాఖ నగరంలో పర్యటించి నగరాభివృద్ధి పనులు, విశాఖ మెట్రో పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, మెడ్ సిటీ పారిశ్రామికవాడ, భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు, వైజాగ్-శ్రీకాకుళం బీచ్ కారిడార్ పనుల గురించి అధికారులతో చర్చించి తగు ఆదేశాలు ఇచ్చారు.
ఇవన్నీ కేవలం ఒక్క నెల రోజులలోనే సిఎం చంద్రబాబు నాయుడు చేసిన పనులు. అందుకే అధికారులు కూడా తన వేగం అందుకుని పనిచేయడం అలవాటు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోవడం చూడవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఫామ్‌హౌస్‌లో ఉన్నారనో లేదా హైదరాబాద్‌లో తన నివాసంలో కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారనో వార్తలు కూడా కనిపించవు!
ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిచేసినా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ అంతకు మించే చేస్తారని అందరికీ తెలుసు.
మరో 25-30 సంవత్సరాల పాటు రాజకీయాలు చేయగల వయసు, ఆరోగ్యం, సామర్ధ్యం అన్నీ తనకు పుష్కలంగా ఉన్నాయని గొప్పలు చెప్పుకున్న జగన్, నేటికీ పులివెందుల ప్యాలస్‌లో సేద తీరుతుంటే, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇంతగా శ్రమిస్తుండటం, ఇద్దరి ఆలోచనా విదానం, పనితీరులో తేడాని ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది.




