చట్టాలు మన చుట్టాలు.. అవి మనకి వర్తించవు!

Jagan KCR

ఏపీలో వైసీపీ అధినేత, పులిచింతల ఎమ్మెల్యే జగన్‌, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు.

జగన్‌ ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ కేసీఆర్‌ ఏ కారణమూ చెప్పకుండానే శాసనసభకు మొహం చాటేస్తున్నారు. ఆయనతో పాటు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ సమావేశాలకు హాజరవడం లేదు. కానీ తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు.

ADVERTISEMENT

ఇక్కడ సిఎం చంద్రబాబు నాయుడు, అక్కడ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని వారిరువురికీ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ జగన్‌, కేసీఆర్‌ హాజరవడం లేదు.

కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు కనుక ఆయన అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఆదేశించవలసిందిగా కోరుతూ విజయ్ పాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేయగా, ముందు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పైనే అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అవడం విచిత్రంగా ఉంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదని, అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వాటిలో మనమే గెలుస్తామని బల్లగుద్ది వాదిస్తున్న కేసీఆర్‌, తాను మాత్రం శాసనసభ సమావేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నారు.

ఇక్కడ ఏపీలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిణామాలే జరుగుతుండటం విశేషం. రాజ్యాంగంలో ఆర్టికల్ 190 (4) ప్రకారం స్పీకర్‌ నుంచి లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోకుండా 60 రోజులు కంటే ఎక్కువ రోజులు శాసనసభకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డెప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు సిఎం చంద్రబాబు నాయుడు ముగ్గురూ జగన్‌ని హెచ్చరిస్తున్నారు.

కానీ జగన్‌ వితండవాదం చేస్తున్నారు. తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వనందుకు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకి హైకోర్టు నోటీస్ ఇచ్చిందని, ముందు దానికి ఆయన సమాధానం చెప్పాలని వాదిస్తున్నారు.

కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ రాజ్యాంగాన్ని, దానిలో చట్టాలను తమ కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ వాటిని గౌరవించడం లేదు. అవంటే వారికి చులకన భావం ఉండటం వలన కావచ్చు లేదా తాము చట్టాలకు అతీతమని భావిస్తుండటం వలన కావచ్చు లేదా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటాలు చేయగల శక్తి సామర్ధ్యాలు తమకి ఉన్నాయనే ధైర్యం వలన కావచ్చు, తమపై అనర్హత వేటు వేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేడని భావిస్తుండటం వలన కావచ్చు.. కారణాలు ఏవైనప్పటికీ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు హాజరవడం లేదు. కనుక రాజ్యాంగం, చట్టం పవర్ ఏమిటో ఓసారి వారికీ రుచి చూపాల్సిన భాద్యత ప్రభుత్వాలదే!

ADVERTISEMENT
Latest Stories