నేనే రాజు… నేనే మంత్రి అంటే….

kcr-jagan-revanth-reddy

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ‘నేనే రాజు… నేనే మంత్రి’ అన్నట్లు అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలు చేయిస్తుండేవారు.

ADVERTISEMENT

ఇదివరకు రేవంత్‌ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలే తీసుకునేవారని పార్టీలో సీనియర్ నేతలు పదేపదే ఆరోపిస్తుండేవారు. కానీ అదే రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతీ విషయం తన మంత్రులు, అధికారులు, మిత్రపక్ష నేతలతో చర్చించి ముందుకు సాగుతుండటం విశేషమే.

ఇదే ఆయన పదవికి, ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చు. ఉదాహరణకు తెలంగాణ రాజముద్రలో మార్పు చేయాలనే నిర్ణయంపై బిఆర్ఎస్ పార్టీ ఎలాగూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుసు. కానీ సామాన్య ప్రజానీకం కూడా ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గ్రహించి వెనక్కు తగ్గింది.

అయితే ఈ రాజముద్ర మార్పు విషయంలో ఆయన కేసీఆర్‌లాగ ఏకపక్ష నిర్ణయం తీసుకొని అమలుచేసి ఉండి ఉంటే నేడు మిత్రపక్షాలు కూడా ఆయనను తప్పు పట్టి ఉండేవి. కానీ ఆయన వారందరితో చర్చించి రాజముద్ర మార్చాలని నిర్ణయించడం వలన, ఈ నిర్ణయంపై బిఆర్ఎస్ నేతలు ఎంతగా విమర్శించినప్పటికీ వారికి ప్రజల మద్దతు లభించలేదు.

బిఆర్ఎస్ నేతలు తప్ప రాష్ట్రంలో మరెవరూ రేవంత్‌ రెడ్డిని నిందించలేదు. సమిష్టి నిర్ణయం వలననే రేవంత్‌ రెడ్డి ఈ ఎదురుదెబ్బ నుంచి తృటిలో తప్పించుకోగలిగారని చెప్పవచ్చు. పైగా దీనిపై శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా బిఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్న కేసీఆర్‌ని ఇరుకున పెట్టబోతున్నట్లు భావించవచ్చు.

తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలుచేసినందున, శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించక తప్పడం లేదు. ఏపీలో జగన్‌ కూడా మూడు రాజధానులు, సంక్షేమ పధకాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలే తీసుకుని అమలుచేశారు.

కనుక ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే దానికి జగన్మోహన్‌ రెడ్డే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మేము నిమిత్తమాతృలమే… మేము గెలిచినా ఓడినా జగన్‌ వల్లే అని చెప్పుకుంటున్నారు కూడా.

కనుక ఏకపక్ష నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాల వలన పార్టీలపై, వాటి అధినేతలపై ప్రభావం ఏవిదంగా ఉంటుందో ఈ రెండు ఉదాహరణలతో స్పష్టం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories