లోకంలో అందరూ చెడ్డవాళ్ళే! జగన్‌ ఒక్కరే….

Chandrababu-Naidu-Pawan-Kalyan-Sharmila-ABN-RK-Ramoji-Rao

జగన్‌ సంధించిన బాణం వెనక్కు తిరిగి వచ్చి ఆయన గుండెల్లోనే గుచ్చుకోబోతోంది. పైకి చెప్పుకోలేని నొప్పి, బాధని ఎల్లకాలం పంటిబిగువున భరించడం చాలా కష్టమే. కనుక జగన్‌ మనసులో ఆ బాధను ఆయన ఆత్మసాక్షి అక్షర రూపంలో నివేదించింది. ఈ రోజు సాక్షి ఆన్‌లైన్‌లో సంచికలో ‘పొలిటికల్ ట్రాప్‌లో షర్మిల… అవేవీ గుర్తులేవా?’ అనే హెడ్డింగ్ పెట్టి కొమ్మినేనివారు ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో వైసీపి నేతలకు మార్గదర్శనం చేశారు.

దాని సారాంశం క్లుప్తంగా చెప్పుకుంటే, లోకంలో ఒక్క జగన్మోహన్‌ రెడ్డి తప్ప అందరూ చెడ్డవాళ్ళే. వైఎస్ షర్మిల అమాయకురాలు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ నేతలు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జగన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలో భాగస్వామిగా మార్చేశారు.

ADVERTISEMENT

వైఎస్ షర్మిల తెలంగాణలోనే ఉంటానని పదేపదే చెప్పినా, కుట్రదారులందరూ కాంగ్రెస్‌ అధిష్టానం, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తమ రాజకీయ అవసరాల కోసం… జగన్మోహన్‌ రెడ్డి మీద రాజకీయకక్ష తీర్చుకోవడం కోసం ఆమెను బలిపశువుగా చేసి ఏపీకి తీసుకువస్తున్నారు.

గతంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీని, చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను విమర్శించిన సంగతి మరిచిపోయారు. అలాగే వారందరూ కూడా ఆమెను విమర్శించిన విషయం మరిచిపోయిన్నట్లు నటిస్తూ ఆమెను ఈ రాజకీయ ఉచ్చులోకి లాగారు.

వైఎస్ షర్మిల అమాయకురాలు కనుకనే వారి ఉచ్చులో చిక్కుకున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్‌ కూడా ఈ కుట్రదారుల రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయారు. ఈనాడు రామోజీ రావు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ వంటి అనేక మంది ఈ కుట్రకు యధాశక్తిన సహకరిస్తున్నారు. వారి కుట్రలకు పవన్‌ కళ్యాణ్‌, సీపీఐ నారాయణ, సీపీఎం రామకృష్ణలు కూడా వంతపాడుతున్నారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ అధిష్టానాన్ని బ్రతిమలాడుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆమెకు చాలా అప్రదిష్టే. కానీ ఎప్పుడో చచ్చిపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీని ఆమె కూడా ప్రాణం పోసి బ్రతికించలేరు. ఈ విషయం తెలియక ఆమె ఈ కుట్రదారుల ఉచ్చులో చిక్కుకున్నారు.

కాంగ్రెస్‌, టిడిపి, జనసేన నేతలు, వైఎస్ షర్మిల ఎవరూ పరస్పరం ఇప్పుడు విమర్శించుకోవడం లేదు. అందరూ జగన్మోహన్‌ రెడ్డిని, వైసీపి ప్రభుత్వాన్ని, పార్టీనే విమర్శిస్తుండటం గమనిస్తే కుట్రదారులందరూ ఏకమయ్యారని అర్దమవుతోంది.

ఆమె అన్న జగన్మోహన్‌ రెడ్డిని, వైసీపిని మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరిని అందరినీ సమానంగా విమర్శించాలి. లేకుంటే ఆమె కూడా వారి కుట్రలో భాగస్వామి అని స్పష్టమవుతుంది.

ఆమె అన్నకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారితో చేతులు కలిపారని ప్రజలు నమ్మితే ఆమెకే నష్టం. సొంత అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఆమె విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు ఆమెనే అసహ్యించుకుంటారు. శాసనసభ ఎన్నికలలో మళ్ళీ వైసీపి గెలిచి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, కుట్రదారులందరూ ఆమెనే నిందిస్తూ విడిచిపెట్టేస్తారు. దాంతో ఆమె రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఏపీ రాజకీయాలలోకి రావడం చాలా పెద్ద తప్పని ఆమె మున్ముందు గ్రహిస్తారు. ఆమె రాజ్యసభ సీటు అడిగి తీసుకొని ఉండాల్సింది.

ADVERTISEMENT
Latest Stories