jagan-mohan-reddy-chance-to-come-to-assembly

వైసీపీ అధినేత జగన్‌ తన ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ప్రజలందరికీ సంక్షేమ పధకాలు అందేవని కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందని, సంక్షేమ పధకాలు అందక ప్రజలు అల్లాడిపోతున్నారని వాదిస్తుంటారు.

తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్స్ పెట్టి ఇవన్నీ చెపుతుంటారు లేదా సొంత మీడియాతో చెప్పిస్తుంటారు. కానీ శాసనసభకి వచ్చి ఇవే మాటలు చెప్పడానికి ఇష్టపడటం లేదు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

ఆనాడు శాసనసభలో తనకి చేసిన అవమానాన్ని సిఎం చంద్రబాబు నాయుడు బహుశః మరిచిపోయారేమో కానీ జగన్‌ నేటికీ మరిచిపోలేదు. ఆ భయంతోనే శాసనసభకు రావడానికి భయపడుతున్నారేమో?

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేధించిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు స్పీకర్‌ పదవిలో ఉన్నారు.ఆనాడు అరికాళ్ళు వాచిపోయేలా రఘురామ కృష్ణరాజుని కొట్టించాననే విషయం కూడా జగన్‌కి బాగా గుర్తుంది. ఇప్పుడు ఆయనే అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్‌ కుర్చీలో కూర్చుంటున్నారు. కనుక వారి ఎదుటకు వచ్చేందుకు జగన్‌ భయపడుతున్నారేమో?

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

తాను ఎంతగానో అవహేళన చేసిన జనసేన అధ్యక్షుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖల మంత్రిగా శాసనసభలో ఎదురుపడతారు. తాను వేధించిన అచ్చన్నాయుడు ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. ఇలా తన చేతిలో అవమానాలు, వేధింపులకు గురైన ప్రతీ ఒక్కరూ శాసనసభలో తన కంటే చాలా ఉన్నత స్థానంలో ఉండగా, కనీసం ప్రధాన ప్రతిపక్షనేత హోదా కూడా లేకుండా ఓ సాధారణ ఎమ్మెల్యేగా వారందరి ఎదుట నిలబడటం జగన్‌కు చాలా నామోషీగా ఉంటుంది. బహుశః అందుకే శాసనసభకు రావడానికి ఇష్టపడటం లేదేమో?

కానీ తాను సింగిల్ సింహాన్ని అని గొప్పలు చెప్పుకున్న జగన్‌, తన ఇగోని పక్కన పెట్టి కూటమి నేతలను శాసనసభలో ఒంటరిగా ఎదుర్కోవడానికి వస్తే, అక్కడ ఎన్ని అవమానాలు ఎదురైనా, వాటి వలన జగన్‌ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడుతుంది తప్ప నష్టపోరు.

Also Read – తండేల్ కాంబోస్..!

ముఖ్యంగా ఎన్నికల హామీలు, సంక్షేమ పధకాలు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి జగన్‌కు చాలా గట్టి అభిప్రాయాలు, అభ్యంతరాలు ఉన్నాయి.

కనుక తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటరిగా కూర్చొని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, శాసనసభకు వచ్చి వాటన్నిటి గురించి గట్టిగా వాదించి ప్రజలను ఆకట్టుకోవచ్చు.

కానీ కూటమి నేతలకు భయపడి ఈసారి కూడా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుండిపోతే అది సింహానికే అవమానం. మరి సింహం వస్తుందా లేదా?వస్తే గర్జిస్తుందా లేక ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి మళ్ళీ పెరటిగుమ్మంలో నుంచి వచ్చి అటెండన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి గోడ దూకి పారిపోతుందా?