
వైసీపీ అధినేత జగన్ నిన్న తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి, ఈ నెల 10 నుంచి జరుగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో వైసీపీ ఎంపీలు మాట్లాడాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన ప్రతిపాదనపై దేశ ప్రజలలో గందరగోళం నెలకొని ఉంది కనుక దానిపై స్పష్టత ఈయాలని వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని, జమిలి ఎన్నికలు నిర్వహించే మాటయితే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయాలని జగన్ సూచించారు.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం ఎత్తు తగ్గింపు తదితర అంశాల గురించి పార్లమెంటులో గట్టిగా పోరాడాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
తాడేపల్లి ప్యాలస్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న శాసనసభలో రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి రాని జగన్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో జాతీయస్థాయి సమస్యలపై ఏం మాట్లాడాలో తన ఎంపీలకు ‘దిశానిర్దేశం’ చేశారని సోషల్ మీడియాలో వైసీపీ ట్వీట్ చేయడం చూస్తే ఎవరికైనా నవ్వురాక తప్పదు.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
కేవలం 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేసిన జగన్, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని తన ఎంపీలకు చెపుతుంటే వారు కూడా నవ్వుకోకుండా ఉండగలరా?
ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికలలోనే వైసీపీ 175/175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని జగన్ గట్టిగా వాదించారు. కానీ ఓడిపోయేసరికి ఈవీఎంల వల్లనే ఓడిపోయామని, కనుక బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే వితండవాదం మొదలుపెట్టారు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ప్రైవేటీకరణ గురించి మొక్కుబడిగా మాట్లాడిన జగన్, ఇప్పుడు పార్లమెంటులో దాని గురించి గట్టిగా మాట్లాడాలని చెపుతున్నారు.
పోలవరానికి రివర్స్ టెండరింగుతో బ్రేకులు వేసి నిలిపేసి, పనులు చేయకుండా చంద్రబాబు నాయుడుని నిందిస్తూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసిన జగన్, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు గురించి పార్లమెంటులో తన ఎంపీలను పోరాడమంటున్నారు!
‘ఇదిగో పులి అంటే అదిగో తోక’ అన్నట్లు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన గురించి దేశంలో అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. కనుక శాసనసభ, లోక్‌సభలో అడుగుపెట్టలేని జగన్ కూడా మాట్లాడేస్తున్నారు.
ఈ విషయాలలో జగన్, వైసీపీ ఎంపీల మాటలకు విలువే ఉండదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రజలను మభ్యపెట్టడానికే. తాము ఆడే ఈ డ్రామాలను ప్రజలు అర్దం చేసుకోలేరనుకోవడం కూడా అవివేకమే.. కదా!