గత ఏడాది సంక్రాంతి పండుగకి తాడేపల్లి ప్యాలస్‌లో తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసి సాక్షాత్ ఆ ఏడుకొండలవాడిని తన ముగింటకు రప్పించుకున్న మహా భక్తుడు జగన్మోహన్ రెడ్డి! అందుకు ఆ ఏడుకొండలవాడు ఆయనని కరుణించి ఎన్నికలల్లో రెండు నామాలు ప్రసాదించాడు కూడా.ఇది ఆనాడు భక్త రామదాసు, భక్త తుకారం, అన్నమయ్య వంటివారికి మాత్రమే సాధ్యపడింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత అటువంటి గొప్ప భక్తుడిని చూడగలుగుతున్నాము.
నేడు వినాయక చవితి. కనుక తాడేపల్లి ప్యాలస్‌లో ఈసారి తప్పకుండా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం సెట్ వేస్తారని ‘గిట్టని భక్తులు’ అనుకున్నారు.
కానీ జగన్ అల్ప సంతోషి. ఆ ఏడుకొండలవాడు ప్రసాదించిన ఆ రెండు నామాలే చాలనుకున్నారో ఏమో ఈసారి కాణిపాకం సెట్ వేయించలేదు!కానీ వైసీపీ కార్యాలయం (తాడేపల్లి ప్యాలస్)లో నేడు వినాయక చవితి పూజలో పాల్గొన్నారు!
జగన్-తిరుపతి యాత్ర అంటూ జరుగుతున్న దుష్ప్రచారం వలన వైసీపీకి రాజకీయంగా నష్టం కలుగుతోంది. కనుక దానికి కౌంటరుగానే నేడు జగన్ వినాయక పూజలో పాల్గొని ఉంటారని గిట్టనివారు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి గుసగుసలు ఎప్పుడూ ఉండేవే పట్టించుకోకూడదు.
అందరు రాజకీయ నాయకుల్లాగే జగన్ కూడా “అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు,” తెలియజేశారు.
కానీ ఈ గిట్టకపోతే రామా అన్న తప్పుగానే వినిపిస్తుందన్నట్లు “గత ఏడాది మీరు గద్దె దిగినప్పుడే మాకు, మా రాష్ట్రానికి విగ్నాలు తొలగిపోయాయంటూ,” సెటైర్లు వేస్తూ సున్నితమైన అయన మనసు నొప్పిస్తున్నారు గిట్టనివాళ్ళు.
సరే.. ఈ సన్నాయి నొక్కులు భరించడమే ఇబ్బందిగా ఉంటే, మైనార్టీల పరిరక్షకుడు, సాక్షాత్ దైవదూత వంటి జగన్మోహన్ రెడ్డి ఈ వినాయక చవితి పూజలు చేయడం ఏమిటి?అని నొచ్చుకొంటున్నవారూ చాలా మందే ఉన్నారు.
డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేకనే తిరుమలకు వెళ్ళడం మానుకున్నప్పుడు, ఇంట్లో ఈ పూజలు, వ్రతాలు ఏమిటి?మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటి? మా మనోభావాలు దెబ్బతింటున్నాయని కొందరు రుసరుసలాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు ముస్లింలతో కలిసి నమాజు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ జగన్ పూజ చేసినా, చేయకపోయినా ఇలా ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటూనే ఉన్నాయి పాపం! కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు… మంచివాళ్ళకే ఇటువంటి కష్టాలు వస్తాయి.






