
ఏపీ మద్యం కుంభకోణం కేసు గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో సొంత మీడియా ఎదుట చేసిన వాదనలు ప్రజలను ఆలోచింపజేస్తాయని భావించినట్లున్నారు. కానీ ఛార్జ్-షీట్‌లో ఆయన పేరు పేర్కొనక మునుపే ‘నేను, నా గ్యాంగ్ నిర్దోషులం’ అన్నట్లు వాదించడం గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లే ఉంది.
ఇంకా చెప్పాలంటే మద్యం కుంభకోణంని ఆపరేషన్ సింధూర్ అంత ఖచ్చితంగా అమలుచేసిన తనకు అత్యంత సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డి రాజ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుండటం, ఈ కేసులో అందరినీ బట్టలూడదీసి నిలబెడతానని విజయసాయి రెడ్డి శపధం చేయడంతో జగన్ తీవ్ర అసహనం, అభద్రతభావానికి గురవుతున్నట్లు జగన్ మాటలలో స్పష్టం అవుతోంది.
Also Read – తొలి అడుగు చాలా అవసరమే!
ఇప్పటికే వైసీపీ నేతలందరూ మద్యం కుంభకోణం కేసులో తమ ఆత్మసాక్షిని పక్కన పెట్టి, వైసీపీ సాక్షి ఎదుట తన వితాండ వాదనలు వినిపించేశారు. ఫైనల్‌గా జగన్ కూడా వచ్చి తన వాదనలు వినిపించారంటే త్వరలో అరెస్ట్ తప్పదని గ్రహించారనుకోవచ్చు.
అయితే తాడేపల్లి ప్యాలస్ సొంత మీడియా ఎదుట మద్యం కుంభకోణం కేసుపై జగన్ ఎంత గట్టిగా తన వాదనలు వినిపించినా న్యాయస్థానాలు ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకోవనే విషయం జగన్‌కు తెలియదనుకోలేము.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
కనుక ఈ కేసులో తనని ఎవరూ టచ్ చేయలేరన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కంటే ఒకవేళ ఈ కేసులో తాను అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే, అప్పుడు వైసీపీని ఎవరు నడిపిస్తారో కూడా జగన్ చెప్పేసి ఉంటే వైసీపీ నేతలకు కూడా క్లారిటీ వచ్చి ఉండేది కదా?